Home Remedies To Stop Runny Nose :వర్షాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల దగ్గు, జలుబు వంటి పలు ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అందులో ముఖ్యంగా చాలా మందికి జలుబు(Cold) చేసినప్పుడు ముక్కు కారుతుంటుంది. పదే పదే ముక్కు కారడం వల్ల ఏ పనీ సక్రమంగా చేయలేం. అలాంటి టైమ్‌లో కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టడం.. మొదలైన వాటి వల్ల తొందరగా ముక్కు కారే సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. 'వంటగదే మన ఫార్మసీ' అంటూ కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేడి కాపడం : ముక్కు కారుతున్నప్పుడు వేడి కాపడం పెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం.. వేడినీటిలో మెత్తటి క్లాత్‌ను ముంచి గట్టిగా పిండేసిన తర్వాత.. ముక్కు, నుదురు, చెంపలపై కాపడం పెట్టాలి. తద్వారా శ్వాస తీసుకోవడం సులువై ముక్కు కారే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు. అలాకాకుండా వేడినీటితో స్నానం చేసినా కొంతమేర ఫలితం ఉంటుందంటున్నారు.
ఆవిరి పట్టడం : ఇది కూడా జలుబు నుంచి ఉపశమనం పొందడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక బౌల్లో కొన్ని వేడి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు లేదా నీలగిరి నూనె/పెప్పర్మింట్ ఆయిల్ రెండు చుక్కలు వేసి ఆవిరి పట్టండి. అయితే, ఆవిరి పట్టేటప్పుడు ఫేస్‌కి, వాటర్‌కి కనీసం 10 ఇంచుల దూరం ఉండేలా చూసుకోవాలి. అలాగే ఐదు నిమిషాలైనా ఆవిరి పట్టేలా చూసుకోవాలని చెబుతున్నారు.
ఎక్కువ వాటర్ తాగడం :చాలా మంది వర్షాకాలం వాతావరణం కూల్‌గా ఉండడం వల్ల ఎక్కువ వాటర్ తాగడానికి ఇష్టపడరు. అలాగే.. జలుబు చేసినప్పుడు అంతగా వాటర్ తీసుకోవాలనిపించదు. కానీ, ఆ టైమ్‌లో నీళ్లు ఎక్కువగా తాగాలంటున్నారు నిపుణులు. అలా తాగడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గి ముక్కు కారే ప్రాబ్లమ్ నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.
అల్లం టీ : మన పెద్దలు ఇప్పటికీ జలుబు, దగ్గు, గొంతునొప్పి లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొంచెం అల్లం టీ తాగమని చెబుతుంటారు. వారు చెప్పినట్టే ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయంటున్నారు నిపుణులు. దీని కోసం కొన్ని అల్లం ముక్కలు తీసుకుని వాటిని బాగా దంచి.. నీటిలో లేదా పాలలో కలపిన తర్వాత బాగా మరిగించి తాగమంటున్నారు.