High Blood Sugar Warning Signs on Feet : ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా విస్తరిస్తోన్న వ్యాధి.. డయాబెటిస్. ఇది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఒక్కసారి ఎటాక్ అయిందంటే లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. అయితే.. దాని వల్ల కలిగే సమస్యలుతీవ్రతరం కాకుండా ఉండాలంటే రక్తంలో చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అలాకాకుండా శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగాయంటే అది టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ లకు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Blood Sugar Warning Signs on Feet :ఇక సాధారణంగా మన శరీరంలో ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు.. లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉయోగించలేనప్పుడు, షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటిస్ వస్తుంది. అయితే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినప్పుడు పాదాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే.. మనకి మధుమేహం వచ్చిందో లేదో విషయాన్ని పాదాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. వాటిని త్వరగా గుర్తిస్తే డయాబెటిస్ ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. లేదంటే అలా వదిలేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, పాదాలలో కనిపించే ఆ లక్షణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..
- బర్నింగ్ సెన్సేషన్ (ముఖ్యంగా మడమల్లో పాదాల దిగువన, అరికాళ్లు)
- కాళ్లల్లో తిమ్మిర్లు రావడం
- పాదాల్లో గుండు సూదులు గుచ్చినట్టుగా అనిపించడం
- కాళ్లలో జలదరింపులు
- పాదాలు చల్లగా అనిపించడం
- పాదాలు, అరికాళ్లుస్పర్శ కోల్పోవడం
- అదేవిధంగా కాళ్లకి ఏమైనా గాయాలయితే ఎక్కువ రోజులు మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కాబట్టి మీ పాదాల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎటువంటి ఆలస్యం చేయకుండా వైద్యులని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ లక్షణాలు మధుమేహానికి సంబంధించినవి. కాబట్టి డాక్టర్‌ను కలిసి టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. అలాగే ఒకవేళ డయాబెటిస్ నిర్ధారణ అయితే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చక్కెర ఎక్కువ ఉండటం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.