తెలంగాణ

telangana

ETV Bharat / health

అమ్మలూ ఇవి తినండి - మీరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది! - Healthy Nuts For Women - HEALTHY NUTS FOR WOMEN

Healthy Nuts For Women : ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మహిళలు క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ పని ఒత్తిడిలో పడి సరైన టైమ్‌కు భోజనం చేయడం కూడా మర్చిపోతుంటారు. అయితే, ఇలా చేయకూడదని ఆరోగ్య నిపుణులంటున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి సమతుల ఆహారం తీసుకుంటూనే.. కొన్ని నట్స్‌ తినాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Healthy Nuts
Healthy Nuts For Women (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 9:53 AM IST

Healthy Nuts For Women :చాలా మంది మహిళలు పని ఒత్తిడిలో పడి సరైన టైమ్‌కు భోజనం చేయకుండా ఉంటారు. ఇంట్లోని కుటుంబ సభ్యులందరి కోసం నిత్యం తపించే వారు.. వారి ఆరోగ్యం పట్ల మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే, ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా టైమ్‌కు తినడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఆహారంలో పిండి పదార్థాలు, ప్రొటీన్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. అయితే, మహిళలు రోజూ సమతుల ఆహారంతో పాటు.. కొన్ని రకాల నట్స్‌ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతున్నారు. మహిళల ఆరోగ్యానికిఎంతో ఉపయోగపడే ఆ నట్స్ ఏవి ? వాటిని తినడం వల్ల ఎలాంటి లాభాలుంటాయి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పిస్తా పప్పులు :
వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఆహారంలో పిస్తా పప్పు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిస్తా పప్పులోని పొటాషియం రక్తపోటు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పులో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది.

బాదం :
బాదంపప్పులో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మహిళల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తాయి. బాదం పప్పులో ఉండే విటమిన్‌ E చర్మాన్ని హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. రోజూ వీటిని తినడం వల్ల చర్మంపై ముడతల రాకుండా అడ్డుకుంటుందని నిపుణులు పేర్కొన్నారు.

జీడిపప్పు :
జీడిపప్పులో జింక్‌, బయోటిన్‌ పోషకాలుంటాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు రోజూ జీడిపప్పలను తినడం వల్ల హెయిర్‌లాస్‌ ప్రాబ్లమ్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

వాల్‌నట్స్ :
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్‌, ప్రొటీన్‌ పుష్కలంగా ఉన్నాయి. రోజూ వీటిని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుందని అంటున్నారు. మహిళలు వీటిని డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చని పేర్కొన్నారు.

ఎండు ద్రాక్ష :
ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే, డైలీ ఎండు ద్రాక్షను తినడం వల్ల ఎటువంటి సప్లిమెంట్స్‌ తీసుకోకుండా దీనిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఎండు ద్రాక్షను తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని అంటున్నారు. 2018లో 'న్యూట్రీషన్ జర్నల్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రక్తహీనతతో బాధపడే మహిళలు రోజూ ఎండు ద్రాక్ష తినడం వల్ల ఈ సమస్య తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో దిల్లీలోని జామియా హమ్దర్ద్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూట్రిషన్ ప్రొఫెసర్ 'డాక్టర్‌ మోహిన్ అరోరా' పాల్గొన్నారు. రక్తహీనత సమస్య ఉన్న మహిళలు డైలీ ఎండు ద్రాక్ష తినడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ డైట్​లో పచ్చి టమాటాలు ఉంటే - రక్తపోటు నుంచి క్యాన్సర్, గుండె జబ్బుల వరకు అన్నీ పరార్! - Raw Tomatoes Health Benefits

మీకు డైలీ చేపలు తినే అలవాటు ఉందా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి! - Benefits of Eating Fish Daily

ABOUT THE AUTHOR

...view details