Healthy Habits for Good Sleep :నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి నిద్రలేమి. ముఖ్యంగా ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు పగలంతా కష్టపడినా, రాత్రిళ్లు ఛాటింగ్, వెబ్ సిరీస్‌లంటూ కాలక్షేపం చేస్తుంటారు. దాంతో చాలా మంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతుంటారు. ఫలితంగా శారీరకంగా, మానసికంగా పలు అనారోగ్య సమస్యలతో పాటు ఒత్తిడి, పనిపై సరిగా దృష్టిపెట్టలేక పోవడం వంటి వివిధ ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొంటుంటారు. అలాకాకుండా ఉండాలంటే మన రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవడం ద్వారా చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సమయ పాలన చాలా ముఖ్యం! : నిద్ర మనకు విశ్రాంతి సమయమే కాదు, శరీరం తిరిగి పుంజుకోవడానికీ, లోపలి మలినాలను శుభ్రం చేసుకోవడానికి కూడా సాయపడే ప్రక్రియ. డైలీ సుఖ నిద్ర కోసం చక్కటి సమయపాలన పాటించడం మంచిదంటున్నారు కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బొడ్డు విజయ్ కుమార్. అంటే రోజూ నిద్ర కోసం ఒక సమయం పెట్టుకుని ఆ సమయానికే నిద్రపోవడం, నిద్ర లేవడం చేయాలంటున్నారు. ఫలితంగా మంచి ఆరోగ్యాన్ని పొందడంతో పాటు వయసునూ దాచేయచ్చంటున్నారు.
గోరువెచ్చటి నీళ్లతో ఇలా చేయండి :చాలా మంది నిద్ర పోవడానికి ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తుంటారు. అయితే ఆ నీళ్లలో కొన్ని వేపాకులు వేసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుందని సలహా ఇస్తున్నారు. అంతేకాదు వేపాకులు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంతో పాటు రోగ నిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయని సూచిస్తున్నారు.
నెయ్యితో ఇలా చేసినా మంచి నిద్ర! : ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. దీనివల్ల కూడా వారు నైట్ టైమ్ సరిగా నిద్రపోలేరు. అలాంటి వారు అరికాళ్లకు నెయ్యితో మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. ఇలా చేయడం ద్వారా నిద్రలేమి సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.