Health Benefits Of Soaked Rice :రోజువారి ఆహారంలో భాగంగా ఉదయం టిఫెన్ తీసుకున్నా.. మిగతా రెండు పూటల్లో ఏదో ఒక పూట తప్పనిసరిగా అన్నం తీసుకుంటుంటారు చాలా మంది. కొందరైతే మూడు పూటలా అన్నమే తీసుకుంటుంటారు. అయితే, సాధారణంగా అన్నం వండేటప్పుడు చాలా మంది రైస్ కడిగి వెంటనే వండుతుంటారు. మరికొందరు మాత్రం అన్నం వండడానికి ముందు కొద్దిసేపు బియ్యాన్ని నానబెట్టి ఆ తర్వాత కుక్ చేస్తుంటారు. ఇలా బియ్యం నానబెట్టి అన్నం వండటం మంచిదేనా అంటే.. నిపుణుల నుంచి "ఎస్" అనే సమాధానమే వస్తుంది. వారు అలా అనడానికి కారణాలేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
బియ్యాన్ని నానబెట్టే ప్రక్రియ దాని గ్లైసెమిక్ ఇండెక్స్(GI), పోషకాహార ప్రొఫైల్‌ను ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది.. ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని ఎంత వేగంగా పెంచుతాయో కొలిచే ఒక మార్గం. సాధారణంగా ఆహారాలకు 0 నుంచి 100 వరకు GI స్కోరు ఇస్తుంటారు. అందులో తక్కువ GI స్కోరు ఉన్న ఫుడ్స్ చాలా స్లోగా జీర్ణమవుతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయంటున్నారు నిపుణులు. అలాగే నిరంతర శక్తిని అందిస్తుందని చెబుతున్నారు.
అలాగే వండేముందు బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచే.. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ ఏర్పడుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. బియ్యం గింజలలో నేచురల్‌గా ఉండే కొన్ని ఎంజైమ్‌లు.. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను సాధారణ గ్లూకోజ్‌గా మార్చే ప్రక్రియనే ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ అని అంటాం.
ఈ చర్య ఫలితంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయట. అంతేకాకుండా.. బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఆహారంలో పోషకాల శోషణ మెరుగుపడుతుందంటున్నారు. ఎందుకంటే.. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ ప్రక్రియ ఫైటిక్ యాసిడ్, టానిన్‌ల వంటి యాంటీ న్యూట్రియంట్‌లను విచ్ఛిన్నం చేసి బాడీకి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వీటితో పాటు బియ్యాన్ని నానబెట్టడం వల్ల రైస్ త్వరగా ఉడకడమే కాకుండా మెత్తగా అవ్వకుండా పలుకులు పలుకులుగా ఉడుకుందంటున్నారు. అలాగే.. అన్నం ఒదుగవుతుందని చెబుతున్నారు.