Health Benefits Of Spinach Juice : ఆకుకూరల్లో ఉండే పోషక విలువల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మనిషి ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అన్ని పిండి పదార్థాలు, విటమిన్లు వంటివి అనేకం పుష్కలంగా ఉంటాయి. అయితే, చాలా మంది వీటిని పప్పు, కూరల్లోనే వేసుకుంటూ ఉంటారు. కానీ, వీటిని జ్యూస్‌లు చేసుకుని తాగడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలను తరిమి కొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలకూర జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సూపర్ పోషకాలు: పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్‌తో పాటు కెరోటిన్, అమైనో ఆమ్లాలు, ఐరన్, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. అయితే పాలకూరను ఉడికించడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే పాలకూరను జ్యూస్ లాగా చేసుకుని తాగమంటున్నారు. ఇక ఈ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే..
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..:పాలకూర జ్యూస్ తాగడం ద్వారా లుటిన్, జియాక్సంతిన్ అనే రెండు ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి మీ కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇంకా పాలకూరలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ లోపం ఉన్నట్లయితే కళ్లు పొడిబారడం, రేచీకటి వంటి దృష్టి లోపాలకు దారితీయవచ్చు.
క్యాన్సర్‌ను దూరం చేస్తుంది..:క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో కూడా పాలకూర జ్యూస్ మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పాలకూరలోని పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నాశనం చేస్తాయి. పచ్చని ఆకుకూరలు తినడం వల్ల ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
రక్తపోటు అదుపులో..:పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి తోడ్పడుతుందని నిపుణులంటున్నారు. ఏడు రోజుల పాటు 27 మందికి పాలకూర జ్యూస్‌ను పరిశోధకులు అందించారు. దీన్ని తీసుకున్న వారిలో రక్తపోటు అదుపులో ఉన్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు.
జుట్టు, చర్మానికి మంచిది..:పాలకూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజూ జ్యూస్‌గా తాగితే జుట్టు, చర్మం మెరిసిపోతుందని నిపుణులంటున్నారు. అలాగే ఇది చర్మ కణాల పెరుగుదల, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పాలకూర రసం తాగడం వల్ల చర్మం మృదువుగా, ముడతలు పడకుండా ఉంటుందట.