Health Benefits of Jamun Seeds:ఊదా, నలుపు రంగుల మిశ్రమంతో మిలమిలా మెరుస్తూ.. రుచికి కాస్త వగరు, తీపిగా ఉండే నేరేడు పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. వర్షాకాలంలో బండ్ల మీద లభించే వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. అయితే చాలా మంది పండు తిని అందులోని గింజలను పారేస్తుంటారు. కానీ ఆ గింజలు కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని అంటున్నారు నిపుణులు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటి? ఆ గింజలను ఎలా తినాలో ఈ స్టోరీలో చూద్దాం..
నేరేడు గింజల్లోని పోషకాలు:ఫైబర్, ప్రొటీన్, ఒమేగా 3, ఒమేగా 6 వంటి కొవ్వులు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్లు, జాంబోలిన్, జాంబోసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ప్రయోజనాలు చూస్తే..
మధుమేహం కంట్రోల్:ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇలాంటి వారు నేరేడుపండ్లతో పాటు నేరేడు గింజలు తిన్నా షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిలోని జాంబోలిన్, జాంబోసిన్ అనే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అంటున్నారు. 2013లో డయాబెటిస్ కేర్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తులు 12 వారాల పాటు రోజుకు రెండుసార్లు 500 మిల్లీగ్రాముల నేరేడు గింజల పొడిని తీసుకుంటే.. వారి రక్తంలో చక్కెర స్థాయిలు, హెమోగ్లోబిన్ A1c స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో దిల్లీలోని AIIMS లో ఎండోక్రినాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుజిత్ శర్మ పాల్గొన్నారు.
లివర్ ఆరోగ్యం మెరుగు:లివర్ ఆరోగ్యం బాగుండాలన్నా నేరేడు గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయంటున్నారు.
రోడ్డు మీద కనిపించే ఈ పండ్లను లైట్ తీస్కోకండి - లివర్, షుగర్ నుంచి గుండె సమస్యల దాకా ఒకే బాణం!
జీర్ణక్రియ మెరుగుదల:నేరేడు గింజలలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని అంటున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:నేరేడు గింజలలో విటమిన్ సి సహా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయని అంటున్నారు.
గుండె ఆరోగ్యానికి మంచిది:నేరేడు గింజల్లోని ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, జంబోలిన్ వంటివి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని.. స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయని అంటున్నారు.