Green Tea Side Effects :కాఫీ, టీలు తాగడం కంటే గ్రీన్ టీ తాగడం చాలా మంచిదని అందరూ అనుకుంటారు. ఈ గ్రీన్ టీ వల్ల బరువు తగ్గి నాజూగ్గా తయారవ్వచ్చని మరికొందరు భావిస్తుంటారు. అందుకే గ్రీన్ టీ తాగే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మితంగా గ్రీన్ టీ తాగితే ఫర్వాలేదు. కానీ, అతిగా గ్రీన్ టీ తాగితేనే సైడ్ ఎఫెట్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కెఫెన్ వల్ల సమస్యలు :
మనం తాగే టీ, కాఫీల్లో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటితో పోల్చితే గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ అతిగా గ్రీన్ టీ తీసుకుంటే, మన శరీరంలోకి అతిగా కెఫిన్ చేరుతుంది. దీని వల్ల నిరుత్సాహం, భయం, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, రక్తపోటు, హృదయ స్పందనల వేగం పెరగడం సహా, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. గుండె సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
ఐరన్ గ్రహించడంలో సమస్య :
మన శరీరానికి అందాల్సిన పోషకాల్లో ఐరన్ ఎంతో ముఖ్యమైనది. అయితే గ్రీన్ టీని పరిమితికి మించి తాగే వారిలో ఐరన్ శోషణలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మనం శరీరం ఐరన్‌ను శోషించుకోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా మనలో రక్తహీనత ఏర్పడుతుంది. అందుకే పరగడుపున కాకుండా, ఆహారంతోపాటే గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.
ఉదర సమస్యలు :
అతిగా గ్రీన్ టీ తాగే వారిలో ఉదర సమస్యలు ఏర్పడతాయి. కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సహా అనేక చికాకులు వస్తాయి. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి.