Gastric Problem Solution In Telugu : సమయానికి భోజనం చేయకపోవడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య మొదలవుతుంది. కారణాలు ఏవైనా కానీ పొట్టలో గ్యాస్ మొదలైతే, అది దీర్ఘకాలం పాటు వేధించే సమస్యగా మారుతుంది. చాలామంది మందులు వేసుకుంటేనో లేదంటే ఇతర మార్గాల ద్వారా దీనిని తగ్గించుకోవచ్చు అనుకుంటారు. కానీ ఆహారం, జీవన శైలిలో మార్పులతో గ్యాస్‌ను తగ్గించుకోవచ్చు. అవసరమైతే మందులను వాడటం ద్వారా పొట్టలో గ్యాస్ సమస్యలను నివారించుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. దానిని ఎలా నియంత్రించాలో చూద్దాం.
ఈ మార్పులు అవసరం
మన జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవటం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చుని నిపుణులు చెబుతున్నారు. పొట్టలో గ్యాస్ సమస్యను తీవ్రతరం చేసే పొగతాగడం, కాఫీ తాగడం, చాక్లెట్లు తినడం లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కొవ్వు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలను తినాలని సలహా ఇస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, బ్రొకొలి, దోసకాయలు తింటే మేలు అని చెబుతున్నారు.
తప్పులు అసలు చేయకండి
మనలో చాలామందికి తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించే అలవాటు ఉంటుంది. ఇది పొట్టలో గ్యాస్ సమస్యను మరింత తీవ్రం చేస్తుందని వైద్యులు అంటున్నారు. తిన్న వెంటనే నిద్రపోతే అరగక ఆహారం నోట్లోకి వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. చికెన్, చేపలు లాంటి వాటిని ఉడికించి లేదా కాల్చినా మంచిదే కానీ, వాటికి ఆయిల్ కలిపి ఏం చేసినా గ్యాస్ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు వైద్యులు.
పొట్టలో గ్యాస్ సమస్య మరీ వేధిస్తుంటే నివారణగా కింద పేర్కొన్న చిట్కాలను పాటించవచ్చు.
పుదీనా/పుదీనా టీ :పుదీనా ఆకులను నమిలినా లేదంటే పుదీనా టీ తాగినా పొట్టలో గ్యాస్ సమస్య నుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది.
చమోమిలే టీ (చామంతి) :చామంతితో చేసిన టీని తాగితే కూడా మంచి ఫలితం లభిస్తుంది.