Foods To Avoid Heart Disease :మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాము. అయితే, ప్రస్తుత కాలంలో నేటి మన ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. దీనివల్ల చిన్నవయసులోనే చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అలాగే కొంతమంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఏ ఆహార పదార్థాలు తినడం తగ్గించాలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రీలత వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
ఎక్కువ మోతాదులో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులుండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి.. గుండె పనితీరు దెబ్బతింటుంది. మన శరీరంలో ఉప్పు మోతాదు ఎంత పెరిగితే.. హార్ట్ ఫెయిల్యుర్ అయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని శ్రీలత చెబుతున్నారు.
రెడ్ మీట్ :
దీనిని అధికంగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ఛాన్స్ ఉంది. వీటిలో ఎక్కువగా ఉండే సంతృప్త కొవ్వులు బాడీలో కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. అందుకే తక్కువగా రెడ్ మీట్ తినాలని డాక్టర్ శ్రీలత చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్ :
తక్కువ మొత్తంలో చక్కెరను తీసుకోవడం ప్రమాదమేమి కాదు. కానీ, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లో.. చక్కెర కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఊబకాయం, అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటుతోపాటు గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.
కుకీలు :
ఏవైనా ఫంక్షన్స్, ఈవెంట్స్ జరిగినప్పుడు కుకీలు, కేక్స్, మఫిన్స్ తినడం తగ్గించాలి. వీటిలో ఉండే అదనపు చక్కెర బరువు పెరిగేలా చేస్తుంది. హై లెవెల్ ట్రైగ్లిజరైడ్స్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటి తయారీలో ఉపయోగించే తెల్ల పిండి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే వెన్నకు బదులుగా లిక్విడ్ ప్లాంట్ ఆయిల్స్ వాడటం మంచిది.
జంక్‌ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ :
బేకరీ, ఫాస్ట్ ఫుడ్ ఆహార పదార్థాలలో ఎక్కువగా ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే పొటాటో వెపర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్లో కూడా ట్రాన్స్‌ఫ్యాట్స్ అధికంగానే ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ట్రాన్స్‌ఫ్యాట్స్ అనేవి మన రోజువారి ఆహారంలో జీరోగా ఉండాలని సూచిస్తున్నారు.
ఒకే నూనెలో వేయించినవి :
"బయట దొరికే మంచురియా, చికెన్ 65, మైసూర్ బజ్జీ, సమోసా, వడ, బోండా వంటి ఆహార పదార్థాలను.. వాడిన ఆయిల్‌లోనే మళ్లీ మళ్లీ వండుతారు. ఇలా ఆయిల్ మార్చకపోవడం వల్ల అందులోని అన్‌శాచురేటెడ్ బ్రాండ్స్ బ్రేక్ అయిపోయి శాచురేటెడ్‌గా మారతాయి. ఇలాంటి నూనెలో వేయించిన పదార్థాలు కూడా గుండెకు హాని చేస్తాయి" అని డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అంటున్నారు.