Foods to Avoid with Arthritis :ప్రస్తుత కాలంలో జీవనశైలి మార్పుల కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందులో 'అర్థరైటిస్' కూడా ఒకటి. దీనినే 'కీళ్లవాతం' అంటారు. కీళ్లవాతంతో కూర్చోవడం, లేవడం, నడవడం, పడుకోవడం.. లాంటి చిన్నచిన్న పనులు కూడా అతి కష్టంగా మారుతాయి. అయితే.. కీళ్లవాతంబారిన పడ్డవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాలేంటో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం.
చక్కెర పదార్థాలు :
అర్థరైటిస్‌తో బాధపడేవారురోజూవారి ఆహారంలో చక్కెరను తగ్గించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్, ఐస్క్రీమ్స్, ఆహార పదార్థాలు, స్వీట్లకు దూరంగా ఉంటే మంచిది.
ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ :
ప్రాసెస్ చేసిన రెడ్ మీట్‌లో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ కొవ్వులు శరీరంలో వాపును పెంచుతాయి. అర్థరైటిస్‌తో బాధపడే వారిలో కీళ్లలో వాపు ఉంటుంది. కాబట్టి, ఇవి తీసుకోవడం వల్ల వాపు మరింత పెరిగి, నొప్పి ఇతర లక్షణాలు తీవ్రతరం అవుతాయి. అందుకే దీనికి దూరంగా ఉండాలి.
గ్లూటెన్ ఉన్న పదార్థాలు :
గోధుమలు, బార్లీ, రై వంటి ధాన్యాలలో గ్లూటెన్ అనే ఒక ప్రొటీన్ ఉంటుంది. కీళ్లవాతంతో బాధపడేవారు గ్లూటెన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల అర్థరైటిస్ లక్షణాలు తగ్గవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి, వీటిని తక్కువగా తీసుకోవాలి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు :
వీటిలో అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్స్, నూనెలు ఉంటాయి. ఇవన్నీ కీళ్లవాతాన్ని పెంచుతాయి. ఈ రకమైనటువంటి ఆహారం ఊబకాయం, షుగర్, అధిక రక్తపోటు వంటి ఇతర అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. కాబట్టి, ప్రాసెస్ చేసిన ఫాస్ట్ఫుడ్, బేకరీ ఐటమ్స్ వంటివాటికి దూరంగా ఉండాలి.
వెజిటబుల్ ఆయిల్స్ :
కీళ్లవాతంతో బాధపడేవారు వంట నూనెల విషయంలో జాగ్రత్త చూపాలి. ఎందుకంటే కొన్ని రకాల నూనెలు శరీరంలో మంట సమస్యని మరింత పెంచుతాయి. కాబట్టి, హెల్దీ ఫ్యాట్స్‌తో ఉండే ఆలివ్ నూనెను ఉపయోగించడం మంచిది.
ఉప్పు :
రోజువారీ ఆహారంలో మనం ఉప్పును తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇది కీళ్లవాతంతో బాధపడేవారికి ఇంకా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉప్పు అధికంగా ఉండే పిజ్జా, చిప్స్, ఫాస్ట్ఫుడ్ వంటివాటికి దూరంగా ఉంటే మంచిది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కీళ్లవాతం సమస్యని తీవ్రం చేస్తాయని National Institutes of Health (NIH) నిపుణుల బృందం కూడా వెల్లడించింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- కీళ్లవాతంతో బాధపడేవారు వైన్, మద్యం వంటివి తక్కువగా తీసుకోవడం మంచిది.
- అలాగే చక్కెర ఎక్కువగా యాడ్ చేసుకోకుండా.. ఒకటి లేదా రెండు టీ/కాఫీలను తాగవచ్చు.
- చక్కెర ఎక్కువగా ఉండే సోడాలు, కూల్డ్రింక్స్కి దూరంగా ఉండాలి.
- కొవ్వు తక్కువగా ఉండే పాలు లేదా పాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్లవాతంతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
గాల్ బ్లాడర్లో రాళ్లతో ఇబ్బందులా? ఆపరేషన్ లేకుండానే ఈజీగా కరిగించుకోవచ్చట!
"తలనొప్పి తరచూ వేధిస్తోందా? - ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి"