Health Benefits Of Finger Millets :దాదాపుగా అందరికీ.. మార్నింగ్ టీ, కాఫీ ఏదో ఒకటి తాగే అలవాటు ఉంటుంది. కానీ, వాటికి బదులుగా ఈ ఆరోగ్యకరమైన డ్రింక్‌ను డైలీ రొటీన్లో చేర్చుకుంటే.. అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగులతో జావ తయారు చేసుకుంటే.. పోషకాలు జుర్రుకోవచ్చని అంటున్నారు. రోజూ ఉదయం ఒక గ్లాసు రాగి జావ తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారని చెబుతున్నారు.
రాగి సంగటి :ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, మధ్యాహ్నం లంచ్‌లో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.
రాగులతో జావ, సంగటి మాత్రమే కాదు.. రాగి పిండితో దోశలు, ఇడ్లీలు, లడ్డూలు, హల్వా, పరోటా.. వంటివి కూడా ప్రిపేర్ చేసుకొని తినవచ్చంటున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వారు రాగులను ఇలా వివిధ వంటకాల రూపంలో తీసుకోవచ్చు. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాలు అంది.. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.
బరువు కంట్రోల్ :అధిక బరువుతో బాధపడేవారు రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. 100 గ్రాముల రాగుల్లో కేవలం 1.9 గ్రాములు మాత్రమే కొవ్వు పదార్థాలు ఉంటాయట. అలాగే ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని కొద్ది మొత్తంలో తీసుకున్నా కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ తినడాన్ని నివారిస్తుందంటున్నారు.
ఎముకలు స్ట్రాంగ్ :రాగుల్లో కాల్షిషయం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 364 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా.. ఇందులో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుందంటున్నారు. అలాగే దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు.