ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / health

శరవేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్- లక్షణాలపై అవగాహన తప్పనిసరి - mpox symptoms - MPOX SYMPTOMS

MPOX: గతంలో మంకీపాక్స్‌గా పిలుచుకున్న ఎంపాక్స్‌గా ఇప్పుడు మళ్లీ కలకలం సృష్టిస్తోంది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, దాని చుట్టుపక్కల దేశాల్లో ఎంపాక్స్‌ విరుచుకుపడుతోంది. ఎంపాక్స్ లక్షణాలు, నివారణ చర్యలపై కనీస అవగాహన తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.

mpox_symptoms
mpox_symptoms (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Aug 20, 2024, 5:57 PM IST

Updated : Sep 17, 2024, 12:53 PM IST

MPOX: మంకీపాక్స్‌గా పిలుచుకున్న ఎంపాక్స్‌ మళ్లీ కలకలం రేపుతోంది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, దాని చుట్టుపక్కల దేశాల్లో ఎంపాక్స్‌ విరుచుకుపడుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నట్టు (పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్సర్న్‌) ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది. కొవిడ్‌-19 విజృంభించినప్పుడు సైతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి హెచ్చరికే జారీ చేయటం గుర్తుండే ఉంటుంది. ఎంపాక్స్‌ కారక వైరస్‌లలో క్లేడ్‌ 1బీ అనే కొత్తరకం మరింత ప్రమాదకరమైంది. ఇది ఎక్కువ ప్రాణాంతకంగా పరిణమించే అవకాశముండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది తొలిసారి ఆఫ్రికాను దాటుకొని స్వీడన్​కు విస్తరించింది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌కూ ఎంపాక్స్​ విస్తరించటం గమనార్హం. మనదగ్గరా విమానాశ్రయాల వంటి చోట్ల ఇప్పటికే తగ జాగ్రత్తలు తీసుకోవటం ప్రారంభించడంతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో మహమ్మారి - మంకీపాక్స్​తో భారత్‌కు ముప్పు ఎంత? - Monkeypox Outbreak

ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన మశూచి (స్మాల్‌పాక్స్‌)కి ఎంపాక్స్‌కూ దగ్గరి సంబంధం ఉంది. ఈ రెండు వైరస్‌లు పాక్స్‌విరిడే కుటుంబంలోని ఆర్థోపాక్స్‌ వైరస్‌ జాతికి చెందినవే కావడం గమనార్హం. సాధారణంగా కుందేళ్లు, ఎలుకలు, చింపాజీలు, గొరిల్లాల నుంచి మనుషులకు సోకుతుంది. కానీ, ప్రస్తుతం మనుషుల్లోనూ ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటూ విస్తరిస్తోంది. ఈ వ్యాధి దానంతటదే తగ్గుతుంది కానీ కొందరికి తీవ్రంగా, ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పిల్లలు, రోగనిరోధకశక్తి తగ్గినవారి ప్రాణాలకు ముప్పు అధికం. ఎంపాక్స్ వ్యాధి బాధితుల్లో 3% నుంచి 10% మంది మరణించే ప్రమాదం ఉంది.

ఎలా సోకుతుందంటే?

  • వైరస్​ బారిన పడిన జంతువులకు, మనుషులకు సన్నిహితంగా మెలిగినప్పుడు ఎంపాక్స్‌ సంక్రమిస్తుంది.
  • ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారి ఉమ్మి, మూత్రం తదితర శరీర స్రావాలు చర్మానికి తగిలినా సరే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తుంది.
  • ముఖం, చర్మం, నోరు ఇలా ఏ రూపంలోనైనా వైరస్​ సోకొచ్చు. ఇది ఒంట్లోకి ప్రవేశించటానికి తగిన పరిస్థితులూ కలిసి రావాల్సి ఉంటుంది. చర్మం ఎక్కడైనా గీసుకుపోయినా, గాయాలైనా, పుండ్లు పడినా.. ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారి శరీర స్రావాలు అక్కడ అంటుకుంటే వైరస్‌ ప్రవేశిస్తుంది. పెద్దవాళ్ల కన్నా పిల్లల్లో ముఖ్యంగా పదేళ్ల లోపు బాల బాలికలకు వైరస్​ ముప్పు ఎక్కువ.
  • ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారితో లైంగికంగా కలిసినా సరే ఎంపాక్స్ అంటుకుంటుంది.

చికిత్స ఇలా?

ఎంపాక్స్‌ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నా ఇది కొత్త జబ్బేమీ కాదు. మంకీ పాక్స్​ పేరుతో గతంలో ఇది తెలిసిందే. చికిత్స కూడా ఉంది. జ్వరం తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్ర చక్కగా ఉపయోగపడుతుంది. పొక్కులు చీము పట్టే ప్రమాదాన్ని తగ్గించేలా యాంటీబయాటిక్స్‌ అవసరం ఉంటుంది. శరీరంలో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు, ద్రవాహారం తీసుకుంటి వ్యాధి తీవ్రతను అడ్డుకోవచ్చు. పోషకాహారం తీసుకోవడంతో పాటు రక్తనాళం ద్వారా సెలైన్‌ ఎక్కించాల్సి ఉంటుంది.

ఎంపాక్స్‌కు సరైన విరుగుడుగా సిడోఫోవిర్, టెకోవిరిమట్‌ యాంటీవైరల్‌ మందులు ఇప్పటికి అందుబాటులో ఉన్నాయి. వీటిని 600 మిల్లీ గ్రాముల మోతాదులో రోజుకు రెండు సార్లు రెండు వారాల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రిన్సిడోఫోవిర్‌ మందు 200 మిల్లీ గ్రాములు వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. సిడోఫోవిర్‌ మందు మన దగ్గర అందుబాటులో ఉంది.

అత్యవసర పరిస్థితుల్లో ఇమ్యునోగ్లోబులిన్లు అందిచాల్సి ఉంటుంది. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధి బాధితులు, క్యాన్సర్‌ చికిత్స తీసుకునేవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

భయమేమీ అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉపశమన చికిత్సలతోనే చాలా మంది కోలుకునే అవకాశాలున్నా సమస్య తీవ్రమైతే ప్రాణాంతకంగా పరిణమించొచ్చు.

మశూచి టీకాతో రక్షణ

మశూచి టీకా సైతం మంకీపాక్స్‌ను ఎదుర్కొనే లక్షణాలు కలిగి ఉంది. ఇప్పటికే కొన్నిదేశాల్లో దీన్ని వాడుతుండగా టీకా తీసుకున్నవారిపై మంకీపాక్స్‌ అంతగా ప్రభావం చూపడం లేదని తెలిస్తోంది. ఇంట్లో ఎవరికైనా మంకీపాక్స్‌ సోకితే కుటుంబసభ్యులంతా తొలి నాలుగు రోజుల్లో టీకా తీసుకుంటే రక్షణ లభిస్తుంది.

లక్షణాలు ఇవీ

  • జ్వరంతో పాటు చర్మం మీద నొప్పితో కూడిన దద్దు, పొక్కులు ఏర్పడటం ఎంపాక్స్ ప్రధాన లక్షణాలు. పొక్కులకు చీము కూడా పడుతుంది.
  • వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించిన 7 నుంచి 17 రోజుల తర్వాత దద్దు రూపంలో బయటపడుతుంది.
  • తీవ్రమైన జ్వరానికి తోడు చర్మం మీద దద్దు తలెత్తుతుంది. మొదట్లో జ్వరంతో పాటు తీవ్ర అలసట, ఒళ్లునొప్పులు, తలనొప్పి, కీళ్లనొప్పులు ఉంటాయి. ఆకలి లేకపోవటం, గొంతులో గరగర, గొంతునొప్పి తీవ్రంగా ఉంటాయి. జ్వరం తగ్గిన తర్వాత దద్దు ముఖం లేదా చేతుల మీద ఆరంభమవుతుంది. అనంతరం ఛాతీ, పొట్ట, వీపు మీదికి విస్తరించి అరిచేతులు, అరికాళ్లలోనూ పొక్కులు ఏర్పడొచ్చు.
  • శరీరం మీద దద్దు రెండు మూడు వారాల పాటు చాలా నెమ్మదిగా విస్తరిస్తాయి.
  • దద్దు, పొక్కులు ఒకే విధంగా ఉండటం ఎంపాక్స్ ప్రత్యేక లక్షణం. దద్దు దశలో దద్దు రూపంలోనే, పొక్కుల దశలో అన్నీ నీటిపొక్కులే ఉంటాయి. చీము దశలో అన్నింటికీ చీము పట్టడంతోపాటు మానిపోయే దశలో అన్నీ చెక్కు కట్టి ఉంటాయి. ఈ పొక్కులు చర్మంలో చాలా లోతుగా ఏర్పడి వేర్వేరు గదులు కలిగి ఉంటాయి. పొక్కులు నెమ్మదిగా వస్తాయి కాబట్టి మానటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి చెక్కు కట్టి, పొట్టుగా మారటానికి పక్షం రోజులు పడుతుంది.
  • దురద అంత ఎక్కువగా ఏమీ అనిపించదు. 4నుంచి 6 రోజుల తర్వాత కొత్త పొక్కులేవీ ఏర్పడవు. పొక్కులు మానిన తర్వాత మచ్చలు ఉంటాయి.

జాగ్రత్తలు తీసుకోవాలి

ఎంపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులంతా మాస్కు ధరించడం తప్పనిసరి.

ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారి దుస్తులు, వస్తువులు మిగతా వారి వాటితో కలపకూడదు. వీరికి సపర్యలు చేసేవారు కరోనా సమయంలో వాడినట్లుగానే గ్లవుజులు, మాస్కు విధిగా ధరించాలి.

ఆఫ్రికాలో 18వేలకు చేరిన ఎంపాక్స్ కేసులు- వ్యాపారుల ఆందోళన- దిల్లీలో హైలెవెల్ మీటింగ్​ - Monkeypox Cases

పాక్​లో మంకీపాక్స్ కలకలం- స్వీడన్​లో తొలి కేసు- వైరస్ లక్షణాలేంటంటే? - Monkeypox Virus In Pakistan

Last Updated : Sep 17, 2024, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details