Dont Share These Things With Best Friends : కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా.. స్నేహితులతో పంచుకుంటాడు మనిషి. అయితే.. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఎంత నమ్మకమైన స్నేహితులైనా.. కొన్ని విషయాలు వారితో పంచుకోకపోవడమే బెటర్ అంటున్నారు. ఇంతకీ ఏంటా విషయాలు? ఎందుకు పంచుకోకూడదు? వంటి పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..
వారి గురించి చెప్పొద్దు:తమ భాగస్వామి గురించి కూడా స్నేహితులతో పంచుకుంటుంటారు చాలా మంది. కానీ ఇలా చేయడం కరక్ట్ కాదంటున్నారు నిపుణులు. మామూలు విషయాలైతే పర్వాలేదుగానీ.. భార్యాభర్తల మధ్య గొడవలు, అభిప్రాయ భేదాలు, సాన్నిహిత్యానికి సంబంధించిన విషయాలు మూడో వ్యక్తికి చెప్పొద్దని సూచిస్తున్నారు. మీ పార్ట్నర్ బిహేవియర్ సరిగా లేకపోవడం గురించి మీ స్నేహితులతో నెగెటివ్‌గా చెప్పడం, వారు చేసిన పొరపాట్ల గురించి పదే పదే ప్రస్తావించడం వల్ల.. మీ భాగస్వామిపై వారిలో ఒక రకమైన నెగెటివ్ ఓపీనియన్ ఏర్పడుతుందని.. ఇది ఇటు స్నేహానికి, అటు ఆలుమగల అనుబంధానికి.. రెండు రకాలుగా నష్టమే అంటున్నారు.
బాధలతో భారం కావద్దు:నిత్యం ఎన్నో సంఘటనలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళన, కోపం, చిరాకు సహజం. అయితే ఇలా మనసుకు బాధ కలిగినప్పుడు వెంటనే స్నేహితులకు ఫోన్ చేసి మనసులోని బాధనంతా వెళ్లగక్కుతాం. అయితే స్నేహితులపై మరీ ఇంతలా ఆధారపడడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. చిన్న చిన్న విషయాలకూ వారిపై ఆధారపడడం, వారి సలహాలు కోరడం వల్ల వారి దృష్టిలో మీరు చులకనయ్యే అవకాశమూ లేకపోలేదంటున్నారు. కాబట్టి కొన్ని సమస్యల్ని మీకు మీరే పరిష్కరించుకుంటే.. మీలోని అభద్రతా భావం దూరమై.. కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటున్నారు నిపుణులు.
మీ దాంపత్యం రొమాంటిక్‌గా ఉండాలంటే - ఇలా చేయండి!
ఆ ముద్దూ ముచ్చట్లు.. మీ మధ్యే:ఆలుమగల అనుబంధాన్ని దృఢం చేసే అంశాల్లో సెక్స్ ఒకటి. అయితే నాలుగ్గోడల మధ్య జరిగే ఈ ముద్దూ ముచ్చట్లనూ కొందరు తమ ప్రాణ స్నేహితులతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలో తమ భాగస్వామి బలహీనతల్నీషేర్ చేసుకునే వారు లేకపోలేదు. ఇది అస్సలు సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీ స్నేహితుల ద్వారా ఇలాంటి విషయాలు మరొకరికి తెలిసి, ఆపై వారు మీ భాగస్వామికి చెప్తే.. మీ అనుబంధంలో సమస్యలొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సున్నితమైన విషయాల గురించి భార్యాభర్తలే ఒకరితో ఒకరు పంచుకోవాలని అంటున్నారు.
అత్తింటి ఆరళ్లు:ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగడం, తిరిగి సద్దుమణగడం సహజం. ఈ క్రమంలో కొంతమంది మహిళలు వీటి గురించి మరీ లోతుగా ఆలోచించి మథన పడుతుంటారు. ఈ క్రమంలోనే స్నేహితురాలితో తమ గోడు వెళ్లబోసుకుంటారు. అయితే అత్తింట్లో జరిగే గొడవల్లోనూ ప్రతిదీ స్నేహితుల దాకా తీసుకెళ్లడం సరికాదంటున్నారు నిపుణులు. దానివల్ల వారు పొరపాటున మరెక్కడైనా, ఇంకెవరితోనైనా ఈ విషయాలు చెప్పినా, అవి మూడో వ్యక్తి ద్వారా మీ అత్తింటి వారికి, మీ భర్తకు తెలిసినా.. సమస్య పెద్దదవుతుంది. మీపై నెగెటివ్ ముద్ర పడిపోతుంది. ఇలా కోరి కోరి గొడవలు పెంచుకోవడం కంటే.. అత్తింట్లో మీకు ఎవరితోనైతే భేదాభిప్రాయాలు వచ్చాయో.. వారితోనే నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
ఆ చాడీలే వద్దు!:ఎంత ప్రాణ స్నేహితులైనా.. అప్పుడప్పుడూ వారి మధ్యా చిన్న చిన్న అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది ఈ గొడవల గురించి ఇతర స్నేహితులతో పంచుకోవడం, వారి గురించి నెగెటివ్‌గా చెప్పడం, లేనిపోని చాడీలు చెప్పడం.. వంటివి చేస్తుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడమంటే ఇదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల మీ గురించి, మీ స్నేహం గురించి అవతలి వారికి నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే మీ ప్రాణ స్నేహితురాలికీ మీపై ఉన్న సదభిప్రాయం దెబ్బతింటుంది. ఫలితంగా గొడవలు మరింత పెద్దవవుతాయి. మీ మధ్య స్నేహబంధమూ సన్నగిల్లుతుంది. ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే.. ఓపికతో మీరిద్దరే గొడవల్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
మీ పార్ట్నర్తో గొడవ పడినప్పుడు ఈ మాటలు అంటున్నారా? - అయితే విడాకులు ఖాయం!