Does Alcohol Improve Sleep Quality :నిద్ర.. మనిషికి చాలా అవసరం. అయితే పలు కారణాల వల్ల చాలా మందికి ఇది దూరమవుతుంది. ఈ క్రమంలోనే ఓ రెండు పెగ్గులు వేస్తే చాలు.. ఏ టెన్షన్ లేకుండా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోవచ్చని కొద్దిమంది ఫీలవుతుంటారు. అలా అనుకున్నదే ఆలస్యం పడుకునే ముందు కడుపులోకి ఓ రెండు గ్లాసుల మందు పంపిస్తుంటారు. మరి ఆల్కహాల్ తాగితే నిద్ర బాగా పడుతుందా ? ఇందులో నిజం ఎంత ? అంటే.. నిపుణుల సమాధానం కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..
పడుకునే ముందు మందు తాగితే నిద్ర పడుతుందా: మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? అంటే.. అది కేవలం ఓ అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. అది ఒక గ్లాస్ వైన్, విస్కీ, బీర్.. ఇలా ఏదైనా నిద్ర పోయే ముందు మద్యం సేవించడం వృథా ప్రయాస అని చెబుతున్నారు. ఎందుకంటే.. మందు తాగడం వల్ల మత్తుతో నిద్రలోకి జారుకున్నా.. శరీరానికి సహజంగా అందాల్సిన విశ్రాంతి మాత్రం దొరకదని అంటున్నారు. నిద్రకు ముందు లిక్కర్ తీసుకుంటే అది మీ ఆర్ఇఎమ్ నిద్రావస్థ (ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్)ను భంగపరుస్తుందని చెబుతున్నారు.
అంతే కాకుండా మందు తాగినప్పుడు మత్తుగా అనిపించి నిద్ర వచ్చినా.. కొద్దిసేపటి తర్వాత అంటే.. ఆల్కహాల్ శరీరంలో కలిసిపోయినప్పుడు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీరు తరచూ నిద్ర మేల్కొంటారని నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల మరుసటి రోజు అలసటగా ఉంటారని చెబుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా.. మీరు ఎప్పుడు మందు తాగుతారు, ఎంత మోతాదులో సేవిస్తారు అనే అంశాలు కూడా నిద్రపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.
2018లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రాత్రి పూట మద్యం సేవించిన వ్యక్తులు.. మద్యం సేవించని వారి కంటే తక్కువ నిద్రపోయారని, అలాగే పగటిపూట ఎక్కువ అలసిపోయినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కెంటుకీలో సెంటర్ ఫర్ స్లీప్ మెడిసిన్ డైరెక్టర్ 'డాక్టర్ చార్లెస్ స్టెంప్' పాల్గొన్నారు. మద్యం నిద్రకు అంతరాయం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.