How to Reduce Dental Problems in Menopause:మహిళల్లో మెనోపాజ్ దశ కాస్త కఠినంగా ఉంటుంది. అయితే గతంలో 55 ఏళ్లు దాటిన వారిలోనే ఇది కనిపిచేంది. కానీ.. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది 40 ఏళ్లలోనే ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ దశలో రుతుక్రమం ఆగిపోతుంది. ఫలితంగా మహిళలను అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అలాంటి వాటిల్లో.. ఒంట్లో వేడి ఆవిర్లు, అరికాళ్లలో మంటలు, చెమటలు పట్టడం, నిద్రలేమి. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ దశలో నోటి సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాలూ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటి? వాటిని ఎలా అధిగమించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయులు తగ్గడం వల్ల లాలాజల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా నోరు పొడిబారటం (జీరోస్టోమియా), గమ్ ఇన్‌ఫెక్షన్లు (పెరియోడాంటల్) వచ్చే ముప్పు ఎక్కువని అంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం కూడా ఇదే విషయాన్ని ఓ అధ్యయనంలో స్పష్టం చేసింది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఫలితంగా కావిటీస్, చిగుళ్ల వాపు, దవడ ఎముకలు బలహీన పడటం, రుచి తెలియకపోవడం, దంత క్షయం లాంటి సమస్యలూ మొదలవుతాయంటున్నారు. మెనోపాజ్ దశకు చేరుకున్న 50 శాతం మహిళల్లో ఈ లక్షణాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 60 దాటిన వారిలో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
ఎలా అధిగమించాలంటే..
- ఈ దశలో దంత సమస్యలను అధిగమించాలంటే.. ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఫ్లోరైడ్ కలిగిన పేస్ట్ వాడటం వల్ల చిగుళ్లు, గమ్ సంబంధిత సమస్యలు తగ్గుతాయంటున్నారు..
- రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం మంచిదంటున్నారు. అలాగే రోజుకొక్కసారైనా గోరువెచ్చని నీటితో పుక్కిలించాలని చెబుతున్నారు.
- కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆహారాలు ఎముకలు, దవడల ఆరోగ్యానికి ఉపయోగపడతాయని సూచిస్తున్నారు. అంటే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బీన్స్, గింజలు, సోయా ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, పండ్లు వంటివన్నీ క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.
- మెనోపాజ్‌లో దంత సమస్యలను తగ్గించడానికి నీళ్లు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. అలాగే రాత్రుళ్లూ హైడ్రేటెడ్‌గా ఉండటానికి హ్యుమిడిఫైయిర్లు వినియోగిస్తే మంచిదంటున్నారు. ఇవన్నీ చేస్తూ క్రమం తప్పకుండా డెంటల్ చెకప్స్‌కు వెళుతుండాలని నిపుణులు సూచిస్తున్నారు.