Crawling Exercise Benefits:కండరాల దృఢంగా ఉండడానికి, కొవ్వు కరిగించుకొని చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి చాలా మంది రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే వీటి ద్వారా శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుందా? లేదా? అని మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా? కానీ అలాంటి అనుమానం లేకుండా శరీరం మొత్తానికి వ్యాయామాన్ని అందిస్తుంది క్రాలింగ్! పసిపిల్లల్లా నేలపై పాకుతూ చేసే వ్యాయామాన్నే క్రాలింగ్ అని పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాలు దృఢంగా
నేలపై పాకడం ద్వారా కాళ్లు, చేతులు, నడుము ఇలా శరీరంలోని ప్రధాన భాగాలన్నీ కదులుతాయి. ఫలితంగా ఆయా భాగాలకు తగినంత వ్యాయామం అంది.. కండరాలు మరింత దృఢంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వెన్నునొప్పి కూడా తగ్గుముఖం పడుతుందని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలోని పోషకాలన్నీ శరీరం గ్రహించేలా చేయడంలోనూ ఈ వ్యాయామం ముఖ్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు. 2018లో Journal of Strength and Conditioning Researchలో ప్రచురితమైన "The Effects of Crawling Exercise on Core Strength and Flexibility in Healthy Adults" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఆ సమస్యలకు దూరం
మనలో సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడుతుంది. దీంతో తరచూ వివిధ రకాల అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రోజువారీ వ్యాయామంలో భాగంగా కాసేపు పాకడాన్ని కూడా సాధన చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ వ్యాయామం వల్ల ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలూ తగ్గుముఖం పడతాయని వివరిస్తున్నారు.
తీరైన ఆకృతి కూడా
మనం పాకేటప్పుడు కాళ్లు, చేతులు, నడుము, తొడలు ఇలా ప్రతి భాగానికీ వ్యాయామం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆయా భాగాల వద్ద కండరాల సామర్థ్యం మెరుగుపడడంతో పాటు అవి తీరైన ఆకృతిలో వస్తాయని తెలిపారు. ఫలితంగా ఇటు ఫిట్‌నెస్‌ను, అటు చక్కటి శరీరాకృతినీ సొంతం చేసుకోవచ్చని వివరిస్తున్నారు.