Benefits of Coconut Oil Apply On Body :మనం సాధారణంగా అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం డైలీ తలకు కొబ్బరి నూనె రాసుకుంటాం. నిజానికి కొబ్బరినూనెలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడతాయి. అయితే.. చాలా మంది చర్మ సంరక్షణ కోసం శరీరానికి కొబ్బరి నూనె(Coconut Oil)అప్లై చేస్తుంటారు. మాయిశ్చరైజర్‌లాగా యూజ్ చేస్తుంటారు. మీక్కూడా చర్మానికి కోకోనట్ ఆయిల్ రాసే అలవాటు ఉందా? అయితే, అలా రాయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొబ్బరి నూనెను కాప్రిక్, లారిక్ యాసిడ్ అని కూడా పిలుచుకుంటాం. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, కొబ్బరినూనెను ఉత్తమ సహజ చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఒకటిగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా కొబ్బరినూనెను చర్మానికి అప్లై చేయడం ద్వారా అనేక సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.
డార్క్ సర్కిల్స్‌కు చెక్ :కొబ్బరినూనెలోని ఔషధ గుణాలు నల్లటి వలయాలు, నల్ల మచ్చలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు నిపుణులు. అలాగే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం వాపు, ముఖం ఎరుపును తగ్గించడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. కోకోనట్ ఆయిల్ చర్మాన్ని టోన్ చేయడానికీ సహాయపడుతుందంటున్నారు.
వృద్ధాప్యాన్ని నివారిస్తుంది :కొబ్బరి నూనెను స్కిన్‌కి అప్లై చేయడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుందట. ఇది చర్మం స్థితిస్థాపకతను మెరుగుపర్చడంతో పాటు వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో కూడా కొంతమేర సహాయపడతాయంటున్నారు.
2019లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మైఖేల్ ఎస్. ఓలివెరా పాల్గొన్నారు. కొబ్బరినూనెలో ఉండే యాంటీ-మైక్రోబయల్ గుణాలు త్వరగా వృద్ధాప్య సంకేతాలు రాకుండా నివారించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
అలర్జీల నుంచి రక్షణ :కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు డెడ్ సెల్స్‌ను తొలగించి తామర వంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కాలుష్య కారకాల నుంచి మంచి రక్షణ కలిగిస్తాయంటున్నారు నిపుణులు.