Cholesterol Drugs Harmful To Health :కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులను ఎక్కువకాలం వినియోగించడం వల్ల.. కణాల నిర్మాణంలో మార్పులు వస్తున్నట్టు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు.. అమెరికన్ సొసైటీ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి వెలువడే "జర్నల్ ఆఫ్ లిపిడ్ రీసెర్చ్"లో ప్రచురితమైనట్టు గతంలోనే సీసీఎంబీ పేర్కొంది. ఈ రీసెర్చ్‌లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే మందులు కణాల నిర్మాణంపై ఏవిధంగా ప్రభావం చూపుతాయో కూడా పరిశోధకులు వివరించారు.
నార్మల్‌గా కణం ఆక్టిన్‌ల వంటి ప్రోటీన్లతో తయారవుతుంది. ఆక్టిన్లు బాడీలోని ప్రతీ కణం చుట్టూ ప్లాస్మా పొర కింద ఉంటాయి. కణాలు ఆకారాన్ని, పరిమాణాన్ని కలిగి ఉండటానికి అవి తోడ్పడతాయి. అయితే.. మీరు కొలెస్ట్రాల్ తగ్గడం కోసం వాడే మందులు రక్తంలోని అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు, కణ నిర్మాణానికి కీలకమైన ఆక్టిన్ ప్రొటీన్ల పాలిమరైజేషన్‌ను ప్రేరేపిస్తోందట. తద్వారా కణాల పరిమాణం, పనితీరులో మార్పులు జరుగుతున్నాయని అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ పారిజాత్ సర్కార్ తెలిపారు. కాబట్టి.. వీలైనంత వరకు కొలెస్ట్రాల్‌ను సహజసిద్ధంగా తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్‌ను సహజసిద్ధంగా ఎలా తగ్గించుకోవాలంటే?
వ్యాయామం :డైలీ వ్యాయామం చేయడం ద్వారా అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చంటున్నారు. వ్యాయామంతో కొలెస్ట్రాల్ కరగడమే కాదు.. కండరాలు బలోపేతం అవుతాయి. టైప్ 2 డయాబెటిస్ సహా ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్నీ తగ్గిస్తుందంటున్నారు. యోగా కూడా కొలెస్ట్రాల్ తగ్గడానికి సహకరిస్తుందని చెబుతున్నారు.
ఆ పదార్థాలు తినడం తగ్గించాలి :బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సిన మరో పని.. మీ డైట్లో సంతృప్త కొవ్వులు తగ్గించడం. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వేయించిన ఆహారాలలో ఈ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.