Childhood Illness Causes Many Diseases in Middle-age :చిన్నతనం నుంచి తరచూ అస్వస్థతకు గురయ్యేవారు, నెల రోజులకు పైగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉంటే వారు నడివయసు దాటాక రెండు అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశం ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా బ్రిటీష్ మెడికల్ జర్నల్(British Medical Journal)లో ప్రచురితమైంది. అయితే అందులో ఎక్కువగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బు, క్యాన్సర్, పక్షవాతం, మానసిక రుగ్మతలు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, క్షయ, అధిక కొలెస్ట్రాల్, దీర్ఘ కాలిక నోటి వ్యాధులు వంటి అనేక వ్యాధులు ఉన్నాయని పరిశోధనలో తేలింది.
అధ్యయనం సాగిన తీరు : బాల్యంలో ఆటలకు దూరంగా ఉండటం, నడక, పరుగు, సుకుమారంగా పెరగడం, శారీరక శ్రమ తెలియకపోవడం వల్ల వారిలో పెద్దయ్యాక దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తాయని అధ్యయనం తేల్చింది. అందుకే జీవనశైలి వ్యాధులకు చిన్నప్పటి జీవన విధానం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఇందులో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు జీవనశైలి వ్యాధులు చుట్టుముడితే, పేదరికంలో ఉన్నవారికి బహుళ వ్యాధులు సోకినట్లు అధ్యయనం స్పష్టం చేసింది.
50 ఏళ్లు పైబడిన వారిలో పరిశోధన ఫలితాలు :
- 45 శాతం మందికి దీర్ఘకాలిక వ్యాధులు లేవు
- ఒకే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న వారు 30 శాతం
- బహుళ వ్యాధిగ్రస్థులు 25 శాతం.
- బాల్యంలోనే అనారోగ్యం వల్ల నెల రోజులకు పైగా బడికి వెళ్లనివారు 53 శాతం
- వీరిలో 50 ఏళ్లు దాటాక బహుళ దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించిన వారు 35 శాతం.
- బాల్యంలో ఆరోగ్యం బాగున్న వారిలోనూ 50 ఏళ్లు దాటాక దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారు 24 శాతం.
- వివాహితుల్లో 24 శాతం అవివాహితులు, జీవిత భాగస్వామి లేని వారిలో 27 శాతం బహుళ వ్యాధులకు గురయ్యారు.
- ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న వారిలో జబ్బులు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం పని చేస్తున్న వారిలో 17 శాతం, పని చేయకుండా ఉన్న వారిలో 31.8 శాతం మంది వ్యాధుల బారిన పడ్డారు.
- వయసు పెరుగుతున్న కొద్దీ బహుళ దీర్ఘకాలిక జబ్బులు సోకే వారి సంఖ్య పెరుగుతోంది.