Admissions to Ekalavya Model Gurukul Vidyalayas for the Academic Year 2025-26 : గిరిజన ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తారు. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
పాఠశాలల ప్రత్యేకతలు :
- సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆరు నుంచి 12 తరగతి వరకు ఏకలవ్య పాఠశాలలు ఉంటాయి.
- ఒక్కో తరగతికి 60 (బాలురు 30, బాలికలు 30) మంది విద్యార్థులు ఉంటారు.
- విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆటస్థలం తదితర సౌకర్యాలు ఉంటాయి.
- బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో డార్మిటరీలు, ఆధునిక వంట గది, విశాలమైన భోజనశాల, క్రీడా ప్రాంగణం, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ.
- స్మార్ట్ విద్యాబోధనలో భాగంగా విద్యార్థులకు డిజిటల్, వర్చువల్ విధానంలో తరగతుల నిర్వహణ.
వయస్సు : ఆరో తరగతిలో ప్రవేశానికి 10 నుంచి 13 ఏళ్ల వయస్సు ఉండాలి.
అర్హతలు : ఈ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే బాలబాలికలు జిల్లాలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి. విద్యాహక్కు చట్టం 2009, సెక్షన్ 4 ప్రకారం విద్యార్థి ఇంటి వద్దనే అయిదో తరగతి చదివిన వారు కూడా అర్హులే. అయితే విద్యార్థి తల్లిదండ్రులు/సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు మాధ్యమంలో చదివిన వారూ రాత పరీక్షకు అర్హులే.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ఇలా : ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు https:-///twreiscet.apcfss..in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌లో విద్యార్థి వివరాలు నమోదు, పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తయిన తరువాత ధ్రువపత్రాలు జతచేసి, పాస్‌పోర్టు సైజు ఫొటో అతికించి సమీపంలో ఉన్న ఏదైనా గురుకుల విద్యాలయంలో సంబంధిత ప్రిన్సిపల్‌కు అందజేసి రసీదు పొందాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటకుండా ఉండాలి. తెలుపు రంగు రేషను కార్డు ఉన్నవారు ఆదాయ ధ్రువపత్రం సమర్పించాల్సిన అవసరం లేదు.
పాఠశాలలు ఎక్కడెక్కడ? : జిల్లాలో గురుకులం ఆధ్వర్యంలో 17 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి.
రంపచోడవరం డివిజన్‌లో: రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, వై.రామవరం, మారేడుమిల్లి, చింతూరు.
పాడేరు డివిజన్‌లో: కొయ్యూరు, గూడెం కొత్తవీధి, డుంబ్రిగుడ, ముంచంగిపుట్ట, చింతపల్లి, పెదబయలు, అనంతగిరి, హకుంపేట, జి.మాడుగుల, అరకు, పాడేరు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 22-01-2025
- దరఖాస్తు ముగింపు: 19-02-2025
- అడ్మిట్ కార్డుల జారీ: తేదీ.22-02-2025
- రాత పరీక్ష: 25-02-2025 (ఉదయం 11.30 గంటలనుంచి)