Chia Seeds Vs Flax Seeds Benefits :కరోనా మహమ్మారితర్వాత చాలా మంది తీసుకునే ఆహారం విషయంలో కాస్త ఎక్కువగానే శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు తమ డైలీ డైట్లో పండ్లు, జ్యూస్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. వీటితో పాటు కొందరు చియా, అవిసె గింజలు(Flax Seeds) వంటి సీడ్స్నూ తీసుకుంటున్నాపు. నిపుణులు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం రోజువారీ ఆహారంలో సీడ్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలోనే చాలా మందికి ఈ రెండింటిలో వేటిని తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనే సందేహం వస్తుంది. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
చియా విత్తనాలు :సాల్వియా హిస్పానికా మొక్క నుంచి లభించే చియా విత్తనాలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ అధిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
అవిసె గింజలు :లినమ్ యుసిటాటిస్సిమమ్ ప్లాంట్ నుంచి అవిసె గింజలను సేకరిస్తారు. ఈ గింజలలో ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే అవిసె గింజల్లో లిగ్నాన్లు 75 నుంచి 800 రెట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఈ లిగ్నాన్లు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే అవిసె గింజలు ప్రొటీన్, అవసరమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.
ఆరోగ్య ప్రయోజనాలు : చియా విత్తనాలు, అవిసె గింజలు రెండూ మొత్తం శ్రేయస్సుకు తోడ్పడే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే సాధారణ పేగు కదలికలకు సహాయం చేయడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. అదనంగా, రెండు విత్తనాలలో కనిపించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంటను, రక్తపోటును తగ్గించడం, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇంకా.. చియా, ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. బాడీలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.