Cervical Cancer Pap Test : మహిళల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముందు వరసలో ఉంటుంది. చాలా మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ పట్ల కొంత అవగాహన ఉన్నప్పటికీ.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మాత్రం మెజారిటీ జనాలకు తెలియదు. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ అని కూడా ఉంటారు. ప్రారంభ దశలోనే దీన్ని గుర్తించలేకపోవడం వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ వ్యాధి బారిన పడకుండా మహిళలు టీకాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించడానికి 'పాప్ టెస్ట్' చేసుకోవాలని చెబుతున్నారు. అసలు ఏంటి ఈ పరీక్ష? ఎంత వయసు వచ్చిన తర్వాత చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎలా వస్తుంది ?
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువమంది భాగస్వాములతోసెక్స్‌లో పాల్గొనడం, గర్భ నిరోధక మాత్రలు వాడటంతోపాటు వంశపారం పర్యంగానూ ఇది ఎక్కువగా వస్తుందట. అలాగే కొన్ని ఇతర కారణాల వల్ల కూడా వస్తుందని అంటున్నారు. ఒక్కసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి 15-20 ఏళ్లు పడుతుందని అంటున్నారు. అందుకే మహిళలు ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి 21 ఏళ్లు దాటాక 'పాప్ స్మియర్ టెస్ట్' చేయించుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.
సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు..
- పీరియడ్స్ టైంలో అధికంగా రక్తస్రావం కావడం
- మెనోపాజ్ తర్వాత సెక్స్‌లో పాల్గొంటే.. సంభోగం తర్వాత రక్తస్రావం కావడం
- పొత్తి కడుపులో నొప్పి
- సెక్స్‌లో పాల్గొన్నప్పుడు.. ఆ తర్వాత యోని దగ్గర నొప్పి, మంట రావడం
- దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జి
- పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం.. అలాగే ఆ సమయంలో నొప్పిగా అనిపించడం
- తరచూ కడుపుబ్బరంగా ఉండటం
- అలసట, నీరసం, విరేచనాలు