తెలంగాణ

telangana

ETV Bharat / health

వయసు మీద పడటం, ఎక్కువ సేపు కూర్చోవడం మాత్రమే కాదు - "నడుము నొప్పి"కి ఇవీ కారణాలే! - Causes Of Back Pain - CAUSES OF BACK PAIN

Causes Of Back Pain : చాలా మందిని నడుము నొప్పి సమస్య వేధిస్తుంటుంది. దీనికి కారణాలంటే వయసు మీద పడటం, ఆపరేషన్లు, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి చెబుతారు. అయితే అవి మాత్రమే కాకుండా ఈ కారణాలు కూడా నడుము నొప్పిని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Back Pain
Causes Of Back Pain (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 2:05 PM IST

Causes Of Back Pain :ప్రస్తుత కాలంలో చాలా మంది నడుము నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే నడుము నొప్పి రావడానికి ఎక్కువ సేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, వయసు మీద పడటం, అధిక బరువు వంటి కారణాలే అని చాలా మంది అనుకుంటారు. అయితే, వీటితో పాటు మరికొన్ని కారణాలు కూడా నడుము నొప్పిని కలుగజేస్తాయని అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

లావు పర్సులు :కెడ్రిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్, డబ్బులు.. ఇలా అన్నింటినీ పర్సుల్లో పెట్టుకుంటారు కొంతమంది. పెద్దగా,లావుగాఉండే పర్సులను ప్యాంటు వెనక జేబులో పెట్టుకొని కుర్చీలో కూర్చుంటే పిరుదుల వద్ద ఉండే కండరాలు ఒత్తిడికి గురవుతాయని.. దీంతో కాళ్లకు వెళ్లే సయాటికా నాడుల మీదా ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇది బ్యాక్‌ పెయిన్‌కి దారితీస్తుందని చెబుతున్నారు. కాబట్టి సన్నటి పర్సులు.. అదీ ముందు జేబులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

వాకింగ్‌ తీరు :రోజూఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం 3 వేల అడుగులైనా వేస్తుంటాం. అయితే, పాదాల నొప్పి, పాదం మధ్యలో ఒంపు లేకపోవటం వంటిసమస్యల వల్ల నడిచేప్పుడు అడుగులు సరిగ్గా పడవు. దీనివల్ల శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం పడుతుంది. నిల్చున్నప్పుడు, నడవటం మొదలెట్టినప్పుడు బ్యాక్‌ పెయిన్‌ ఉంటే.. పాదం సమస్యలేవైనా ఉన్నాయేమో పరీక్షించుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

టైట్‌ జీన్స్​:కొంత మంది ఫ్యాషన్‌ పేరుతో టైట్‌గా ఉండే జీన్స్ ధరిస్తారు. కానీ, బిగుతైన ప్యాంట్లు ధరించడం వల్ల శరీర కదలికలపై ప్రభావం పడుతుందని.. దీనివల్ల కూర్చునే భంగిమ దెబ్బతింటుందని అంటున్నారు. ముఖ్యంగా నడుము కింది భాగం, కటి ప్రాంతం కదలిలకు టైట్‌గా ఉండే ప్యాంట్లు అడ్డు తగులుతాయిని.. దీంతో మనం కూర్చుంటున్నప్పుడు వంగిపోయేలా చేస్తాయి. దీనివల్ల క్రమంగా నడుము తిన్నగా ఉండటానికి తోడ్పడే కండరాలు బలహీనమవుతాయని నిపుణులంటున్నారు. దీర్ఘకాలంలో ఇది నొప్పికి దారితీస్తుందని పేర్కొన్నారు.

వీడియో గేమ్స్‌ ఆడటం :కొంత మందికి వీడియో గేమ్స్‌ ఆడే అలవాటు ఉంటుంది. వీడియో గేమ్స్‌ ఆడేటప్పుడు మెడను ముందుకు చాచి, భుజాలు కిందికి వాల్చి గంటల కొద్దీ కుర్చీలో కూర్చుని ఆడుతుంటారు. దీనివల్ల కూర్చునే భంగిమ దెబ్బతింటుంది. ఎక్కువసేపు కూర్చొవడం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి, ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల నడుము నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి అరగంటకోసారి బ్రేక్‌ తీసుకోవడం, సోఫాలో కూర్చొవడం కన్నా థెరపీ బాల్‌పై కూర్చోవటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చని సూచిస్తున్నారు.

ఆకలి లేకున్నా తినాలనిపిస్తోందా?.. అయితే, కారణాలు ఇవే! - ఇలా తగ్గించుకోండి!

నాడుల వద్ద మచ్చ : వీపులో నాడుల చుట్టూరా దెబ్బలు తగలటం లేదా శస్త్రచికిత్స చేసినప్పుడు అక్కడ మచ్చతో కూడిన కణజాలం పెరుగుతుందని నిపుణులంటున్నారు. గట్టిగా, మందంగా ఉండే ఇది నాడులు కోలుకోవటానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. అయితే, ఇది కదిలినప్పుడు సున్నితమైన భాగానికి రుద్దుకుంటుంది. దీంతో ఈ మచ్చ నాడులకు రక్త సరఫరానూ అడ్డుకుంటుంది. ఇవి రెండూ బ్యాక్‌ పెయిన్‌ని తెచ్చిపెట్టేవే. ఎలక్ట్రిక్‌ పల్స్‌తో వైద్యులు మచ్చపడిన నాడులకు చికిత్స చేస్తారు. దీంతో నొప్పి సంకేతాలు పక్కలకు మళ్లుతాయని నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

నిద్రలేమి :ఈ రోజుల్లో కొంత మంది అర్ధరాత్రి వరకు ఫోన్‌లు చూస్తూ త్వరగా నిద్రపోవడం లేదు. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య నడుము నొప్పికిదారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. త్వరగా నిద్ర పట్టకపోవటం, పట్టినా మధ్యలో మేల్కోవటం వంటి సమస్యలతో బాధపడేవారికి బ్యాక్‌ పెయిన్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.

2018లో "స్పైన్‌" (Spine) అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులకు నడుము నొప్పి వచ్చే అవకాశం 1.5 రెట్లు ఎక్కువ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఫ్రాన్స్‌లోని పారిస్ డెస్కార్టెస్ యూనివర్సిటికీ చెందిన 'డాక్టర్‌ ఎ స్మిత్‌' పాల్గొన్నారు. రాత్రి 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

స్మోకింగ్‌ :సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి తాగేవారికి బ్యాక్‌ పెయిన్‌ వచ్చే అవకాశం సుమారు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుదట. ఎందుకంటే పొగాకు వల్ల కణజాలాలకు, ఎముకలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల వెన్నుపూసల మధ్య ఉండే గట్టి రబ్బరు లాంటి డిస్కులు క్షీణిస్తాయని నిపుణులంటున్నారు. ఇది నొప్పికి దారితీస్తుందని పేర్కొన్నారు. స్మోకింగ్‌ వల్ల దెబ్బతిన్న డిస్కు నయం కావటమూ ఆలస్యమవుతుంది. నొప్పి తగ్గకుండా వేధిస్తూ ఉంటుంది. నికొటిన్‌ మూలంగా పెయిన్‌ మరింత తీవ్రం కావొచ్చనీ నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి స్మోకింగ్‌ అలవాటుంటే వెంటనే మానెయ్యటం మంచిది.

శరీరం ఎత్తు :ఎక్కువ హైట్‌ ఉండటం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉందట. మన హైట్‌కు నడుము సమస్యలకూ సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పొట్టివారితో పోలిస్తే కనీసం 5.7 అడుగుల ఎత్తుండే మహిళలకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం 20 శాతం ఎక్కువని చెబుతున్నాయి. పొడవైన మగవారికీ.. ముఖ్యంగా 6.1 అడుగుల ఎత్తు గలవారికీ నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాకపోతే వీరికి నొప్పి అంత తీవ్రంగా ఉండదు! హార్మోన్లు, హైట్‌ మూలంగా బాడీ కదిలే తీరు నడుము నొప్పికి కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎక్కువ హైట్‌ ఉన్నవారు తరచు కిందికి వంగటం వల్ల భంగిమ మారుతుంది. కాబట్టి కిందికి వంగేటప్పుడు సరైన విధానాన్ని పాటిస్తే బ్యాక్‌ పెయిన్‌ బారినపడకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు.

NOTE : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డైలీ 10వేల స్టెప్స్ వాకింగ్ నిజంగా మంచిదేనా? నిమిషానికి ఎన్ని అడుగులేస్తే బెటర్!

వెంటనే బాత్రూమ్​కు పరిగెత్తాల్సివస్తోందా? - కారణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి!

ABOUT THE AUTHOR

...view details