Buttermilk With Salt Side Effects : కమ్మటి పెరుగు, చల్లటి మజ్జిగ వీటిని ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో చల్లటి అనుభూతి కోసం మజ్జిగను ఎక్కువగానే తాగుతుంటారు. వాస్తవానికి ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మజ్జిగలో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, విటమిన్-కే2, విటమిన్-డీ వంటి వివిధ రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి ఎముకలు, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తపోటును తగ్గించడం వంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని లాభాలు కలిగించే మజ్జిగలో ఉప్పు వేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే హని కలిగే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.
పెరుగు లాగే మజ్జిగ, లస్సీలు మంచి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయెజనకరమైన లక్షణాలు కలిగి ఉంటాయి. కానీ, మజ్జిగలో ఉప్పు వేసుకోవడం వల్ల కొంత మందిలో అలర్జీ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. అలాగే ఉప్పులోని సోడియం కారణంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. చాలా మంది భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగడానికి ఇష్టపడతారని, వాస్తవానికి ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడమే కాకుండా బద్దకం, అలసట, కడుపు ఉబ్బరం, అపానవాయువు వంటి సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపారు. మజ్జిగలో పుష్కలంగా లభించే ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయని, అయితే మజ్జిగలో ఉప్పు కలుపుకుని తాగడం మాత్రం కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపుతుందని ఆయన చెబుతున్నారు.
ఉప్పు వల్ల ప్రతికూల ప్రభావం
మజ్జిగలో ఉప్పు కలపడం వల్ల కడుపులోని మంచి బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావితం ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇది జీర్ణక్రియపై హానికరమైన ప్రభావం చూపుతుంది. సోడియం ప్రోబయోటిక్స్ల కార్యాచరణ ప్రభావాన్ని తగ్గించి కడుపులోని మంచి బ్యాక్టీరియాలను చంపేస్తుంది. ఇది కడుపులో నొప్పి, అతిసారం, గ్యాస్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు వాంతులు, దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.