Blood Pressure Medication:ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే రక్తపోటు.. నేడు యువతలోనూ కనిపిస్తోంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. నేటి యువత ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పు, శారీరక, మానసిక రుగ్మతల కారణంగా ఎక్కువ మంది రక్తపోటు (బీపీ) బారిన పడుతున్నారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరికి బీపీ ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో -WHO) అంచనా వేసింది. కరోనా తర్వాత ఈ కేసులు మరింత పెరిగాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, సమయపాలన అలవర్చుకోకపోవడం వంటి కారణాలతో యువత ప్రధానంగా హైపర్ టెన్షన్ బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఒక్కసారి బీపీ ఎటాక్ అయిన తర్వాత జీవితాంతం మందులు వాడాల్సిందేనా? అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి దీనికి నిపుణులు సమాధానం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సాధారణంగా బీపీ 120/80 ఉండటం మంచిది. నిరంతరం రక్తపోటు ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంటే చికిత్స అవసరమవుతుంది. అదీ ఒకసారి బీపీ పరీక్షతోనే సమస్యను నిర్ధారించరు. కొద్ది రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పరీక్షించి.. అన్నిసార్లూ రక్తపోటు ఎక్కువగా నమోదవుతుంటేనే సమస్య ఉన్నట్టుగా నిర్ధరిస్తారు. అలాగే.. తలనొప్పి, మైకం, వంటి బీపీకి సంబంధించిన ఇతరత్రా సమస్యలు ఉంటే బీపీ ఉన్నట్లు నిర్ధరిస్తారని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గిల్లా నవోదయ్ అంటున్నారు. అప్పుడు సైతం మొదట్లోనే మాత్రలు ఇవ్వరని.. బీపీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ ఛేంజెస్(Healthdirect రిపోర్ట్) చేసుకోవాలని సూచిస్తున్నారు. అవి ఏంటంటే..
ఆహారం:ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన ఆహారాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సోడియం తగ్గించి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.
వ్యాయామం:వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయమని సలహా ఇస్తున్నారు. అలాగే నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయవచ్చని సూచిస్తున్నారు. అలాగే వాటర్ ఎక్కువ తాగాలని, సరిపడా నిద్ర పోవాలని చెబుతున్నారు.
జీవనశైలి మార్పులు:స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు మానుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలని సలహా ఇస్తున్నారు.