Best Ways To Avoid Hunger Habit :సహజంగా మనకు ఆకలి అవుతోందంటే.. శరీరానికి శక్తి కావాలని అర్థం. అప్పుడు మనం ఏదో ఒక ఆహారాన్ని శరీరానికి అందిస్తుంటాం. కానీ.. చాలా మంది ఆకలి లేకున్నా తింటుంటారు. మరి.. ఆకలి(Hunger) లేకున్నా ఎందుకు తినాలనిపిస్తుంది? అందుకు కారణాలేంటి? దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఈ అలవాటును మానుకోవాలంటే ఏం చేయాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆకలి లేనప్పుడు ఎందుకు తినాలనిపిస్తుందంటే?:ఆకలి లేనప్పుడు తినాలనిపించే సమస్య వెనక అనేక కారణాలు ఉంటాయని న్యూట్రిషనిస్ట్ దీప్తి ఖతుజా చెబుతున్నారు. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..
- సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ తలెత్తవచ్చని చెబుతున్నారు. కొంతమంది ఏదో ఒకటి తినాలనే ఉద్దేశంతో అసంపూర్తిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఇది కూడా ఆకలి లేనప్పుడు తినడానికి కారణం కావొచ్చంటున్నారు.
- అలాగే.. ప్రతి 2-3 గంటల మధ్య అల్పాహారం తీసుకోవాలనే అలవాటు.. అంటే రాత్రి భోజం తర్వాత స్నాక్స్ తినడం వంటివి ఈ సమస్యకు దారితీయవచ్చంటున్నారు. అదేవిధంగా చక్కెర ఉండే తీపి పదార్ధాలు తినడం వల్ల కూడా ఆకలి కలుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
- మరికొందరిలో ఒత్తిడి, మానసిక ఆందోళన, ఒంటరితనం, ప్రతికూల ఆలోచనలు.. వంటివన్నీ ఆకలి భావాలను కలిగిస్తాయని చెబుతున్నారు.
- ఒత్తిడి లేదా భావోద్వేగానికి గురైనప్పుడు గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆకలి, దప్పికలకు, ఎక్కువ తినడానికి దారితీస్తుందంటున్నారు.
ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే?
- ఆకలి లేకపోయినా తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో అదనపు క్యాలరీలు చేరి బరువు పెరగడానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
- అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా.. హైపర్‌టెన్షన్, మధుమేహం, కార్డియోవాస్కులర్ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.
- వీటితో పాటు పలు మానసిక సమస్యలకూ దారి తీస్తుందంటున్నారు దీప్తి ఖతుజా.
- 2018లో 'International Journal of Obesity'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆకలితో లేనప్పుడు తినడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం ప్రమాదం పెరుగుతుందట.