Best Tips for Prevent Nails Breakage : మీరు తరచూ నెయిల్స్ విరిగిపోయే సమస్యతో బాధపడుతున్నారా? అయితే.. కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే మీ గోళ్లు(Nails) విరిగే సమస్య తగ్గడమే కాకుండా.. పొడవైన, ఆరోగ్యమైన గోళ్లను సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సరైన పోషకాహారం :గోళ్లను ఆరోగ్యంగా, విరగకుండా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బయోటిన్ ఎక్కువగా ఉండే ఉడికించిన గుడ్లు, క్యాలీఫ్లవర్, అవకాడో వంటి పదార్థాలు అధికంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు. ఫలితంగా గోళ్లు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే విటమిన్ A, C, E, కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు అధికంగా లభించే ఆహార పదార్థాలనూ రోజూ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
తగినంత వాటర్ :నెయిల్స్ కాస్త పెరగ్గానే పొడిబారి పెళుసుగా మారి విరిగిపోకుండా ఉండాలంటే.. హైడ్రేట్‌గా ఉండటం అవసరమంటున్నారు నిపుణులు. ఇందుకోసం రోజూ తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. అదనంగా.. మాయిశ్చరైజింగ్ హ్యాండ్ క్రీమ్ లేదా క్యూటికల్ ఆయిల్ క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల.. అది గోళ్లు, చుట్టుపక్కల చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుందట. ఇది గోళ్లు విరిగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
సంరక్షణ చర్యలు : పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఇంటి పనులు చేసేప్పుడు గ్లౌజులు ధరిస్తే.. నెయిల్స్ మీద ప్రత్యక్షంగా ప్రభావం పడదు. డిటర్జెంట్స్ ఉపయోగించే పనిచేసిన వెంటనే.. అది గోళ్లలో ఇరుక్కోకుండా వెంటనే నీటితో శుభ్రం చేసుకోవాలంటున్నారు. అలాగే డబ్బా మూతలు తీసేందుకు నెయిల్స్ వాడొద్దని సూచిస్తున్నారు.
గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం :అందంగా గోళ్లు పెంచుకోవాలనుకుంటే అవి శుభ్రంగా ఉండేలా కూడా జాగ్రత్తపడాలి. లేదంటే.. గోళ్లపై ఉండే మురికి వల్ల బ్యాక్టీరియా చేరి గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే.. ఎప్పటికప్పుడు నెయిల్స్‌ను శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. గోళ్ల కింద మురికిని తొలగించడానికి సున్నితమైన నెయిల్ బ్రష్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.