Best Habits to Make Brain Powerful : ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు సవాలక్ష పనులు. ఎన్నో ఒత్తిళ్లు. ఈ ఒత్తిళ్లతో మెదడు మొద్దుబారిపోతుంటుంది. చురుగ్గా ఉండలేకపోతుంటాం. చేసే పనిపై ఏకాగ్రత ఉండదు. ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. అయితే.. ఈ సమస్యలన్నీ తొలగిపోయి మెదడు చురుగ్గా, పవర్ ఫుల్‌గా పనిచేయాలంటే కొన్ని పనులు అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాట్ల వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా శక్తితోపాటు మొత్తంగా మెదడు శక్తిమంతం అవుతుందని వివరిస్తున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వ్యాయామం:శరీరంలో రక్త సరఫరా తగిన విధంగా ఉండాలంటే వ్యాయామం కంపల్సరీ అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా పెరిగి.. ఆక్సిజన్, పోషకాలు తగిన స్థాయిలో అందుతాయంటున్నారు. అంతేకాదు.. వ్యాయామం కొత్త న్యూరాన్ల పెరుగుదలనూ ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. అలా అనీ మరీ కఠిన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని.. ఏరోబిక్ వ్యాయామాలు, నడక, జాగింగ్ వంటివి సరిపోతాయని నిపుణులు చెప్తున్నారు.
2011లో జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేసే వృద్ధులలో జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరు మెరుగుపడిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అడ్వెంట్‌హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాన్స్‌లేషనల్ న్యూరోసైన్స్ డైరెక్టర్ డాక్టర్ కిర్క్ I. ఎరిక్సన్, Ph.D పాల్గొన్నారు.
ఆహారం:యాంటీ ఆక్సిడెంట్లు, గుడ్ ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే.. మెదడుకు సంబంధించి సమస్యలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, బెర్రీస్, చేపలు, డ్రైఫ్రూట్స్ వంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని, అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని అంటున్నారు.
నిద్ర: మన నిద్ర పోయిన సమయంలోనే మన బ్రెయిన్‌కు రెస్ట్ దొరుకుతుంది. అప్పుడే మన జ్ఞాపకాలు, కొత్తగా నేర్చుకున్న అంశాలను ఓ క్రమపద్ధతిలో స్టోర్ చేసుకుంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం నిద్ర లేకపోవడం అభిజ్ఞా పనితీరును బలహీనపరుస్తుందని, జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుందని కనుగొన్నారు. కాబట్టి మెదడును పదునుగా ఉంచడానికి ప్రతి రాత్రి తగినంత నాణ్యమైన నిద్ర పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.
సోషల్ యాక్టివిటీస్: స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా అభిజ్ఞా పనితీరును మెరుగుపరచవచ్చని నిపుణులు అంటున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన ప్రకారం సోషల్ యాక్టివిటీస్ డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు.
ధ్యానం:రోజులో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల మెదడులోని గ్రేమేటర్ పెరుగుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల్లో తేలింది. మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తికి, ఉద్వేగాలను నియంత్రించుకోవడానికి ఈ గ్రేమేటరే కీలకమని కనుగొన్నారు.