తెలంగాణ

telangana

ETV Bharat / health

అధిక కొలెస్ట్రాల్​ వెన్నలా కరగాలా? - డైలీ డైట్​లో ఈ ఆహారాలు చేర్చుకుంటే మంచిదట!

-హై కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం -రోజూ ఇవి తిన్నారంటే ఐస్​లా కరిగిపోతుందట!

By ETV Bharat Health Team

Published : 5 hours ago

HOW TO LOWER CHOLESTEROL
Diet Plan to Reduce Bad Cholesterol (ETV Bharat)

Best Diet Plan to Reduce Bad Cholesterol: ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది చూడ్డానికి సన్నగా కనిపించినప్పటికీ.. బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటోంది. మరి మీరు హై కొలెస్ట్రాల్​తో ఇబ్బంది పడుతున్నారా? మందులేసుకోవటానికి వెనకాడుతున్నారా? అయితే, ఈ ఆహార, వ్యాయామ నియమాలను ప్రయత్నించి చూడండి. ఈజీగా కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవచ్చంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్. ఇంతకీ.. కొలెస్ట్రాల్ తగ్గాలంటే డైలీ మహిళలు పాటించాల్సిన ఆ నియమాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మహిళల్లో చాలా మంది సన్నగా ఉన్నాం.. బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ తక్కువగా ఉంటాయనే భావనలో ఉంటారు. కానీ, సన్నగా ఉన్నంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉన్నామని నిర్ధారించలేం అంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. ఎందుకంటే.. కొందరికి హార్మోనుల్లో అసమతుల్యత, థైరాయిడ్‌ వంటివి కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం కావచ్చంటున్నారు. అంతేకాదు.. జన్యుపరంగా కూడా ఈ కొలెస్ట్రాల్‌ పెరిగే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

సాధారణంగా మన దేశంలో మహిళలకు నడుము చుట్టుకొలత 80 సెంటీమీటర్లకు మించకూడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉందంటే.. మీ శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లు గుర్తించాలంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది. అలాగే.. తీసుకునే ఫుడ్​లో చక్కెర తగ్గించాలి. బయట ఫుడ్​, బేకరీ ఫుడ్స్‌కీ వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా.. చాక్లెట్స్, కూల్‌డ్రింక్స్‌ పూర్తిగా మానేయాలని సూచిస్తున్నారు.

అలర్ట్ ఎవ్రీవన్ : మారిపోయిన కొలెస్ట్రాల్ లెక్కలు​ - తొలిసారి CSI మార్గదర్శకాలు - అంతకు మించితే అంతే!

కొలెస్ట్రాల్ తగ్గాలంటే డైలీ డైట్​లో ఇవి ఉండాల్సిందే!

  • కొలెస్ట్రాల్ తగ్గాలంటే పైన చెప్పిన వాటికి దూరంగా ఉండడంతో పాటు.. రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా డైట్ ప్లాన్ ఉండాలని సూచిస్తున్నారు.
  • అందులో భాగంగా రోజూ తీసుకునే ఆహారంలో పీచు ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. ఇందుకోసం పాలిష్‌ పట్టని గింజధాన్యాలు, తృణధాన్యాలను మాత్రమే యూజ్ చేయాలి.
  • అలాగే.. ఒకపూట భోజనంలో రైస్‌ తీసుకున్నా రాత్రికి మల్టీగ్రెయిన్‌ రోటీ, జొన్నరొట్టెవంటివి తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా మీ బరువుని బట్టి మీ శరీరానికి ఎన్ని కెలోరీలు అవసరమో పోషకాహార నిపుణులను సంప్రదించి అందుకు అనుగుణంగా తీసుకోవాలి.
  • వీటితో పాటూ ఏదో ఒక సమయంలో 150 గ్రా. పండ్లు తినేలా చూసుకోవాలి. అలాగే సాయంత్రం టైమ్​లో పెసలు, అలసందలు, బొబ్బర్లు, శనగలను ఉడికించి సలాడ్స్ రూపంలో తీసుకుంటే కడుపు నిండుగా ఉండి ఆకలి కంట్రోల్​లో ఉంటుంది.
  • బీన్స్, క్యారెట్, బెండకాయ, ఆకుకూరల ద్వారా పీచుపదార్థం అధికంగా లభిస్తుంది. మాంసాహారులైతే 150గ్రా. చేపలు, 100గ్రా. చొప్పున చికెన్, రెడ్‌మీట్‌ను తక్కువ నూనెతో వండి, గ్రేవీ లేకుండా తినేలా చూసుకోవాలంటున్నారు. అదేవిధంగా.. ప్రతి మూడునెలలకోసారి వంట నూనెను మారుస్తూ ఉండాలి.
  • ఇవన్నీ పాటిస్తూనే డైలీ వ్యాయామాలూ చేయాలి. మీ శారీరక శ్రమను బట్టి దీనికో ప్రణాళిక ఉండాలి. ఎంతసేపు వ్యాయామం చేశామనే దానికన్నా ఎన్ని క్యాలరీలు ఖర్చుచేశారన్నది ముఖ్యమనే విషయం గుర్తుంచుకోవాలి.
  • కనీసం రోజూ పదివేల అడుగులైనా వేసేలా చూసుకోవాలి. ఈ ఆహార, వ్యాయామ నియమాల్ని క్రమం తప్పకుండా పాటిస్తే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు.. మంచి కొలస్ట్రాల్‌ పెరుగుతుందని సూచిస్తున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్!

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కొలెస్ట్రాల్ తగ్గడానికి మందులు వాడుతున్నారా? - నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details