Beetroot Paratha Making Process:ఇడ్లీ, పూరీ, దోశ, వడ.. ఇలా రోజూ ఒకే రకమైన టిఫెన్ తిని బోర్ కొట్టిందా..? కొత్తగా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఇది. బీట్రూట్ పరాటా.. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయి. అదేంటి.. మాకు మామూలు పరాటా తెలుసు, ఆలు పరాటా తెలుసు.. ఈ బీట్రూట్ పరాటా ఏంటి అనుకుంటున్నారా..? మీరు విన్నది నిజమే బీట్రూట్తో పరాటా చేసుకుని లాగించేస్తే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం కోసం.. స్టోరీలోకి ఎంటర్ అవుదాం.
బీట్రూట్ పరాటాకి కావాల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి- 2 కప్పులు
- బీట్రూట్-ఒకటిన్నర కప్పు (తురుముకోవాలి)
- అల్లం తురుము - అర టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- గరం మసాలా- అరటీస్పూన్
- డ్రై మ్యాంగో పొడి- అర టీస్పూన్
- కొత్తిమీర తురుము- 2 టీస్పూన్లు
- పచ్చిమిర్చి- 1(సన్నగా తురుముకోవాలి)
- ఆయిల్- 3 టీ స్పూన్లు
- ఉప్పు-రుచికి సరిపడా
క్రిస్పీ పొటాటో లాలీపాప్స్- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!
తయారీ విధానం:
- ముందుగా బీట్రూట్ పొట్టు తీసి.. ముక్కలుగా కట్‌చేసుకుని తురుముకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి.. రెండు టీ స్పూన్లు నూనె పోసుకోవాలి.
- నూనె వేడెక్కాక.. అల్లం తురుము, తురిమిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత తురుముకున్న బీట్రూట్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి.. రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- తర్వాత కొన్ని నీళ్లు పోసుకుని.. మూతపెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
- బీట్రూట్ కుక్ అయిన తర్వాత.. గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- ఆ తర్వాత ఉడికిన బీట్రూట్ను తీసుకుని మిక్సీలో వేసుకుని నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్‌లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఓ గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుని.. ఓ స్పూన్ ఆయిల్, చిటికెడు ఉప్పు వేసుకోవాలి.
- తర్వాత అందులోనే జీలకర్ర, గరం మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, వాము వేసి కలపాలి.
- ఆ తర్వాత పిండిలో ముందే రెడీ చేసుకున్న బీట్రూట్ పేస్ట్, కొత్తిమీర వేసి పిండి ముద్దలాగ కలుపుకోవాలి.
- ఒకవేళ నీరు ఏమైనా అవసరం అయితే.. కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని ముద్దలాగ కలుపుకోవాలి..
- ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకోని.. పరాటాలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద దోశ పెనం పెట్టి హీట్ అయిన తర్వాత కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి.. దాని మీద పరాటా వేసి రెండు వైపులా గోధుమ రంగు కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి. అన్ని పరాటాలను కూడా ఇలానే చేసుకోవాలి.
- అంతే ఎంతో రుచికరమైన బీట్రూట్ పరాటా రెడీ. దీన్ని పెరుగు లేదా చట్నీతో తినొచ్చు..
బీట్ రూట్ ఆరోగ్య ప్రయోజనాలు:బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. అంతేకాకుండా రక్తహీనతను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
స్నాక్స్‌లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!
వెజ్ సాండ్విచ్ ఈజీ రెసిపీ.. కాస్త దేశీ టచ్ ఇస్తే మరింత టేస్టీగా!