Can Drinking Beer Remove Kidney Stones? :మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా.. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు. అయితే.. మూత్రపిండాల్లో రాళ్లు(Kidney Stones) ఉన్నాయని తేలినప్పుడు కొందరు వైద్యుల సూచనలు పాటిస్తుండగా.. మరికొందరు మాత్రం "సొంత వైద్యానికి" ప్రయారిటీ ఇస్తుంటారు. ఇలాంటి వాటిలో బీరు తాగడం ఒకటి. బీరు తాగడం వల్ల కిడ్నీలోని రాళ్లు బయటకు వచ్చేస్తాయని వీరు నమ్ముతుంటారు. మరి.. నిజంగానే బీరు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ తొలగిపోతాయా? ఇందులో నిజమెంత? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వైద్యుల మాట ఇదీ..
"బీరు తాగడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ తొలగిపోతాయా?" అనే ప్రశ్నకు ఢిల్లీకి చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ వహీద్ ఈ విధంగా వివరణ ఇస్తున్నారు. బీరు అనేది ఒక ఆల్కహాలిక్ డ్రింక్. ఇది తాగినప్పుడు సాధారణం కంటే ఎక్కువ మూత్రవిసర్జన అవుతుంది. కాబట్టి.. ఆ సమయంలో చిన్న చిన్న రాళ్లు ఏవైనా బయటకు రావొచ్చు తప్ప.. బీరు కిడ్నీలోని రాళ్లను తొలగిస్తుందనేది అపోహ అంటున్నారు.
నీళ్లు తక్కువ తాగితే కిడ్నీలకు డేంజర్ - మరి ఎక్కువగా తాగితే?
ఇంకా ఏమంటున్నారంటే.. నిజానికి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. కానీ.. ఇందుకు బీరు మాత్రం బెస్ట్ ఛాయిస్ కాదని స్పష్టం చేస్తు్ననారు. ఎందుకంటే.. బీరు శరీరంలోని నీటి శాతాన్ని తొలగించి డీహైడ్రేషన్‌కు దారితీస్తుందంటున్నారు. అదే జరిగితే మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటిశాతం తగ్గడమనేది.. కిడ్నీలో రాళ్లు తొలగిపోవడానికి అడ్డంకిగా మారడంతోపాటు మూత్రపిండాలను దెబ్బతీయవచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. రెగ్యులర్‌గా బీరు తాగేవారిలో ఆక్సలేట్లు అధికంగా ఏర్పడి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని మరింత ఎక్కవ చేస్తుందంటున్నారు. కాబట్టి.. ఏ సందర్భంలోనైనా మద్యం అనేది ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.
రీసెర్చ్ మాట ఇదీ..
2011లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. బీరు తాగడం మూత్రంలో కాల్షియం సాంద్రతను పెంచుతుందని, ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని 'హాస్పిటల్ క్లినికో సాన్ కార్లోస్'కు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ లూయిస్ గార్సియా-రోడ్రిగ్జ్ పాల్గొన్నారు. బీరు తాగడం వల్ల కిడ్నీ రాళ్లు తొలగిపోవడ ఏమోకానీ.. ఏర్పడే ప్రమాదాన్ని మాత్రం పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు.
సర్వే మాట ఇదీ..
కిడ్నీ సమస్యలపై దేశంలో "ప్రిస్టిన్ హెల్త్ కేర్" ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. వివిధ నగరాల్లో నివసించే 10,000 మందిని కలిసింది. దాదాపు ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు ఈ సర్వే తెలిపింది. అంతేకాదు.. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని ప్రతీ ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఈ కారణంతో దాదాపు 50 శాతం మంది చికిత్స ఆలస్యం చేస్తున్నారని చెప్పింది. దానివల్ల చేజేతులా కిడ్నీలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఏం చేయాలి..?
కిడ్నీ రాళ్లు ఎవరికి వస్తాయో చెప్పటం కష్టమని, శరీర తత్వాన్ని బట్టి ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం ఒంట్లో నీటిశాతం తగ్గటం, కొన్నిరకాల ఆహారపు అలవాట్లు కూడా కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడడానికి కారణం అవుతాయట. కిడ్నీలో స్టోన్స్ తొలగించుకోవడానికి వైద్యుల సూచనలు పాటిస్తూ.. వాటర్ ఎక్కువగా తాగడం, సిట్రస్ పండ్ల రసాలు తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం, కొబ్బరి నీళ్లు తీసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పాదాలలో వాపు, నొప్పి, దురదగా అనిపిస్తోందా? - అయితే మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే!