తెలంగాణ

telangana

ETV Bharat / health

బార్లీ వాటర్​ - ఎండ నుంచి రక్ష మాత్రమే కాదు - ఈ సమస్యలకు కూడా దివ్యౌషధం! - Barley Water Benefits in Summer - BARLEY WATER BENEFITS IN SUMMER

Barley Water Health Benefits: ఎండలు మండిపోతున్నాయి. కొద్దిసేపు బయటకి వెళ్తే చాలు... భానుడు మన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం లాగేసుకున్నట్లే అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఓ గ్లాసు బార్లీ నీళ్లు తాగితే.. వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..

Barley Water Health Benefits
Barley Water Health Benefits

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 4:10 PM IST

Barley Water Health Benefits in Summer: ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మే నెల రాకముందే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలా కాసేపు బయటికి వెళ్లినా ఒంట్లోని శక్తి మొత్తం ఎవరో స్ట్రా వేసి పీల్చినట్లే అనిపిస్తుంది. అంతేకాకుండా వేసవి తాపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అన్నం తినాలనిపించదు, తినకపోతే ఆకలి సమస్య, డీహైడ్రేషన్‌, వడ దెబ్బ, అతిసారం వంటివి ఎలాగూ తప్పవు. అయితే వేసవితో ముడిపడి ఉండే ఇటువుంటి సమస్యలకు బార్లీ నీళ్లతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. కేవలం వేసవి సమస్యలకే కాదు అనేక ఆరోగ్య సమస్యలకు కూడా బార్లీ బాగా పని చేస్తుందని చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బార్లీలో పోషకాలు:బార్లీ వాటర్‌లో శరీర వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కాల్షియం, ఫైబర్‌, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వేసవిలో బార్లీ వాటర్‌ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

బార్లీవాటర్​ ప్రయోజనాలు:

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:బార్లీలో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. బీటా-గ్లూకాన్ చెడు (LDL) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మంచి (HDL) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

2017లో BMC మెడిసిన్ జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. బార్లీ వాటర్​ తాగే వ్యక్తులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 9% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై జియాటాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన డా. డాంగ్ లియు పాల్గొన్నారు. బార్లీ నీరు చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది:వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణంగా వచ్చే సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా క్లీన్​ అవుతుంది. అజీర్తి దూరమవుతుంది. బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బద్ధకం ఉన్న‌వారు బార్లీ నీటిని తాగితే మంచిది. బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ‌ ప‌దార్థాల‌న్నీ బ‌య‌టికి వెళ్లిపోతాయి.

డీహైడ్రేషన్​ను నివారిస్తుంది: బార్లీలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. డీహైడ్రేషన్ సమయంలో ఈ ఎలక్ట్రోలైట్లు శరీరం నుంచి కోల్పోతాయి. ఈ క్రమంలో బార్లీ నీరు తాగడం ఈ ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడానికి, శరీరం హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:బార్లీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బీటా-గ్లూకాన్ రక్తప్రవాహంలో చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో స్పైక్‌లను నివారించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​ వచ్చాయా? నిద్రలేకపోవడమే కాదు, ఇవీ కారణాలే! - Reasons for Dark Circles

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:ఆకలిని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడానికి శరీరాన్ని బార్లీ ప్రేరేపిస్తుంది. బార్లీ వాటర్ తీసుకున్నప్పుడు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ హార్మోన్లు జీవక్రియను పెంచుతాయి. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:బార్లీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో ఇవి సహాయపడతాయి.

గర్భిణిలకు మంచిది:ఇక గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. అలసట కూడా అనిపించదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఇన్ఫెక్షన్లు దూరం:మహిళలను తరచూ ఇబ్బందికి గురిచేసే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్‌. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయని.. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయని చెబుతున్నారు.

బార్లీ నీరు ఎలా తయారు చేయాలంటే..

  • బార్లీని లైట్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు వేయించుకొని, పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద గిన్నె పెట్టి మూడు కప్పుల నీటిని పోసి మరిగించాలి.
  • మరోవైపు రెండు చెంచాల బార్లీ పొడిని పావు కప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి.
  • మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి.
  • పది నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి.
  • ఈ నీటికి చిటికెడు ఉప్పు కలిపి ఈ వేసవిలో తరచూ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఉప్పుతో పాటు పావు గ్లాసు పల్చని మజ్జిగ కూడా కలుపుకుని తాగొచ్చు..

సో చూశారుగా.. ఇన్ని ప్రయోజనాలు కలిగిన బార్లీ నీళ్లను ఇకనైనా ట్రై చేస్తారు కదూ!

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మిక్స్‌‌డ్ వెజిటబుల్ సలాడ్ - తింటే బరువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు- ఈజీగా చేసుకోండిలా! - Vegetable Salad For Weight Loss

ఈ టీ తాగితే - 300 ఉన్న షుగర్ కూడా నార్మల్​కు రావడం పక్కా! - Health Benefits of Mango Peel Tea

ఏ టైమ్‌లో షుగర్‌ టెస్ట్‌ చేసుకుంటే - రిజల్ట్‌ పక్కాగా వస్తుంది? - మీకు తెలుసా ? - Best Time To Sugar Test

ABOUT THE AUTHOR

...view details