Ayurvedic Treatment for Dry Cough:చలికాలంలో చాలా మందిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తుంటాయి. ముఖ్యంగా కొన్నిసార్లు విపరీతమైన పొడి దగ్గు సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. ఈ పొడి దగ్గు వల్ల ఎంతో ఇబ్బంది పడాల్సివస్తుంది. అయితే ఇలాంటి వారికోసం ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉందని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. కేవలం మన ఇంట్లోనే ఉండే పదార్థాలతో ఈజీగా తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 40 గ్రాముల తాలీసపత్రీ చూర్ణం
- 10 గ్రాముల శొంఠి చూర్ణం
- 10 గ్రాముల పిప్పళ్ల చూర్ణం
- 10 గ్రాముల మిరియాల చూర్ణం
- 10 గ్రాముల వెదురు ఉప్పు చూర్ణం
- 10 గ్రాముల యాలకుల చూర్ణం
- 10 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణం
- 100 గ్రాముల పటిక బెల్లం చూర్ణం
తయారీ విధానం:ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో తాలీసపత్రీ చూర్ణం, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, వెదురు ఉప్పు, యాలకులు, దాల్చిన చెక్క, పటిక బెల్లం చూర్ణం వేసి బాగా కలపాలి.
ఎలా తీసుకోవాలి?:ఈ ఔషధాన్ని పొడి దగ్గు సమస్యతో బాధపడేవారు మూడు పూటలా చిన్న చెంచా చూర్ణాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిని చెంచా చూర్ణాన్ని తీసుకుని నాలుకతో అద్దుకుంటూ తీసుకోవాలని అంటున్నారు. నేరుగా మింగేయకూడదని, అలానే నీటిలో కూడా కలిపి తీసుకోకూడదని వివరిస్తున్నారు.
తాలీసపత్రీ: పొడి దగ్గు సమస్యను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని గాయత్రీ దేవీ చెబుతున్నారు.
శొంఠి:చలికాలంలో వచ్చే కఫాన్ని తగ్గించడంలో శొంఠి ఉపయోగపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.