Turmeric Overdose Side Effects:పసుపు యాంటీ బయాటిక్ అని.. ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇలా అతిగా వాడడం వల్ల అనేక అనర్థాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. పసుపును మోతాదుకు మించి వాడడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి, దీన్ని అతిగా వాడితే ఏమవుతుంది? ఎంత మోతాదులో వాడడం మంచిది? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Journal of Medicinal Food అధ్యయనం ప్రకారం.. పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో తలనొప్పి, మగతగా అనిపించడం, విరేచనాలు, మలబద్ధకం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్క్యుమిన్ స్థాయులు పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. Curcumin: A Review of Its’ Effects on Human Health అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో అమెరికాలోని Central Michigan University ప్రొఫెసర్ Susan J Hewlings పాల్గొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జీర్ణ సమస్యలు:మనం రోజువారీ ఆహారంలో ఉపయోగించే పసుపు పైత్య రసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని నిపుణులు వెల్లడించారు. ఇది జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవడంలో సహకరిస్తుందని వివరించారు. అయితే పసుపును మోతాదుకు మించి తీసుకుంటే పైత్య రసం ఎక్కువగా ఉత్పత్తవుతుందని తెలిపారు. ఫలితంగా ఆమ్లాల మోతాదు కూడా పెరిగి జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితి కొన్నిసార్లు పేగుల్లో అల్సర్లకూ కారణమవుతుందని పేర్కొన్నారు.
కిడ్నీలో రాళ్లు:పసుపులో ఉండే ఆక్సలేట్ సమ్మేళనాలు శరీరంలోని క్యాల్షియం సమ్మేళనాల మధ్య బంధాన్ని దృఢం చేయడంలో సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాల్షియం విచ్ఛిత్తి జరగక.. అవి క్యాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్‌గా మారతాయని వీటినే కిడ్నీ స్టోన్స్‌గా పిలుస్తారన్నారు. కూరల్లో మోతాదుకు మించి పసుపు వాడే వారిలో దీర్ఘకాలంలో ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని వివరించారు.