Alcohol Health Risks in Women :మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. అయినా అవేమీ పట్టించుకోకుండా మగాళ్లతోపాటు ఆడవాళ్లు కూడా మందు తాగేస్తున్నారు. అయితే.. ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనం మాత్రం మహిళలు మందు తాగొద్దని చెబుతోంది. మద్యం(Alcohol) తాగితే పురుషులకన్నా మహిళల ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదమని వెల్లడైంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
"Journal of the American College of Cardiology"అనే పేరుతో ఈ రీసెర్చ్ రిపోర్టు ప్రచురితమైంది. దీని ప్రకారం.. ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ రకాల మద్యం సేవించే మహిళలకు గుండె జబ్బుల ముప్పు గణనీయంగా ఉంటుందని తేలింది. ఈ అధ్యయనంలో 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల 4 లక్షలకు పైగా మందిని పరిశీలించారట!
అదేవిధంగా.. మితంగా మద్యం తాగే మహిళలతో పోలిస్తే, ఎక్కువ మద్యం తాగే మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 33 నుంచి 51 శాతం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ఇందులో మరో షాకింగ్ విషయం కూడా ఉంది. చాలా మంది అప్పుడప్పుడు మద్యం తాగుతున్నాం.. తమకు ఏమీ కాదని భావిస్తుంటారు. కానీ.. అప్పుడప్పుడూ తాగినా.. అతిగా తాగితే మాత్రం వారిలో ఈ ప్రమాదం 68 శాతం వరకు ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అప్పుడప్పుడూ ఎక్కువగా ఆల్కహాల్ తాగే పురుషుల్లో కూడా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 33 శాతం ఎక్కువగా కనిపించిందని ఆ అధ్యయనం పేర్కొంది. కాబట్టి.. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్‌ను సమతుల్యంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు.