Kamal Haasan And Rajinikanth Friendship :కమల్ హాసన్, రజనీకాంత్ దక్షిణ భారత సినిమా రంగాన్ని ఏలుతోన్న సూపర్ స్టార్‌లు. ఈ లెజెండరీ యాక్టర్లు దేశవ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చాలా సినిమాల్లో కలిసి పని చేశారు. అయితే 1985 నుంచి ఏ సినిమాలోనూ ఇద్దరూ కలిసి పని చేయలేదు. దీంతో ఇంత సుదీర్ఘ కాలం ఇద్దరూ ఎందుకు కలిసి పని చేయలేదు? అనే చర్చ సినీ ప్రియుల్లో మొదలైంది. ఇది కేవలం పోటీనా లేక ఏదైనా వివాదం ఉందా? అనే ఊహాగానాలు సైతం మొదలయ్యాయి. అయితే కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
కేవలం పోటీ మాత్రమే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్‌ని ఈ రూమర్స్ గురించి ప్రశ్నించారు. తమ మధ్య పోటీ ఉంది తప్ప, అసూయ, చెడు ఉద్దేశాలు లేవని కమల్ స్పష్టం చేశారు. తమకు ఒకరే గురువు ఉన్నారని, తమవి కేవలం రెండు విభిన్న మార్గాలని వివరించారు. కలిసి పనిచేయడం మానేయాలనే నిర్ణయం ఎప్పటిదో అని కమల్ హాసన్ వెల్లడించారు. అలానే ఒకరిపై మరొకరు చులకన వ్యాఖ్యలు ఎప్పుడూ చేసుకోలేదని, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇద్దరం అంగీకరించామని తెలిపారు.
చిరకాల మిత్రులు
కమల్, రజనీ కలిసి సినిమాలు చేయనప్పటికీ సన్నిహిత మిత్రులుగానే ఉన్నారు. వారు తరచుగా సోషల్ మీడియాలో ఒకరికొకరు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు. వారి స్నేహం గురించి చాలా ఈవెంట్లలో మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు 'దళపతి' సెట్‌లో జరిగిన ఒక సంఘటన గురించి తాజాగా మీడియాతో పంచుకున్నారు రజనీ. కొన్ని సన్నివేశాల్లో ఇబ్బంది పడ్డానని, ఆ సమయంలో కమల్‌కి ఫోన్ చేసి సలహా అడిగానని చెప్పారు. ఇది వారి రిలేషన్, ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.