Viswambhara vs Gamechanger : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సీజన్ అంటే సంక్రాంతి అనే చెప్పాలి. ఆ సమయంలో పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు తిరుగులేని సీజన్ ఇది. అందుకే ఈ సీజన్లో ఒకే సారి మూడు నాలుగు సినిమాలు బరిలోకి దిగినా, అన్నీ చిత్రాలను ఆదరించి ఆశీర్వదిస్తుంటారు సినీ ప్రేక్షకులు. ఇక ఇదే పండగ బరిలో సినిమా హిట్ అయితే కాసుల వర్షమే అని చెప్పాలి. అందుకే ఈ ముగ్గుల పండగ బరిలో నిలిచి బాక్సాఫీస్ ముందు అదరగొట్టేందుకు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోస్ కూడా ఉవ్విళ్లూరుతుంటారు. దీనికోసం ఏడెనిమిది నెలల ముందు నుంచే తమ చిత్ర రిలీజ్ కోసం కర్చీఫ్ వేస్తుంటారు.
అలా ఈ సారి వచ్చే సంక్రాంతి కోసం కర్ఛీఫ్ వేసిన వాటిలో ముందుగా రిలీజ్ డేట్ ఖాయం చేసుకున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరనే. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్పై సందిగ్ధత నెలకొంది. షూటింగ్ పూర్తి కావొచ్చినా, విజువల్ ఎఫెక్ట్స్, ప్రీ ప్రొడక్షన్ పనులు సమయానికి పూర్తయ్యేలా లేదని, అందుకే ఈ చిత్రం వాయిదా పడుతుందనే కొత్త ప్రచారం మొదలైంది.
ఇక ఇదే సమయంలో క్రిస్మస్కు వస్తుందనుకున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 'విశ్వంభర' సంక్రాంతికి రాకపోతే తమ చిత్రాన్ని ముగ్గుల పండక్కి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. అప్పుడు విడుదలైతే సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అడ్వాంటేజ్ ఉంటుందని, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం ఉంటుందని ఆయన భావిస్తున్నారట. ఏదేమైనా ఈ గందరగోళానికి ఎప్పుడు తెరపడుతుందో, క్లారిటీ ఎప్పుడు వస్తుందో అని మెగా అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.