తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'లైలా' రివ్యూ : విశ్వక్ లేడీ గెటప్ సినిమా ఎలా ఉందంటే? - LAILA MOVIE REVIEW

విశ్వక్​సేన్ లైలా సినిమా రివ్యూ- కంథేంటి? ఎలా ఉంది? తెలుసుకుందామా?

Laila Movie Review
Laila Movie Review (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2025, 3:16 PM IST

Laila Movie Review :: సినిమా: లైలా; నటీనటులు: విశ్వక్‌సేన్‌, ఆకాంక్ష శర్మ, అభిమ‌న్యు సింగ్‌, పృథ్వీరాజ్‌, మిర్చి కిర‌ణ్‌, పృథ్వీ త‌ద‌త‌రులు; ర‌చ‌న: వాసుదేవ మూర్తి; మ్యూజిక్ డైరెక్టర్: లియోన్ జేమ్స్; ఛాయాగ్రహ‌ణం: రిచర్డ్ ప్రసాద్; క‌ళ‌: బ్రహ్మ కడలి; ప్రొడ్యూసర్: సాహు గారపాటి; డైరెక్టర్: రామ్ నారాయణ్; ప్రొడక్షన్ బ్యానర్: షైన్ స్క్రీన్స్; విడుద‌ల‌: 14 ఫిబ్రవరి 2025

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్ లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ సినిమా 'లైలా'. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్​లో కనిపించారు. తెలుగులో చాలా రోజుల త‌ర్వాత ఓ హీరో పూర్తిస్థాయి లేడీ గెట‌ప్‌లో కనిపించిన సినిమా ఇది. వాలెంటైన్స్​ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

క‌థేంటంటే?
సోనూ మోడ‌ల్ అలియాస్ సోనూ (విశ్వక్‌ సేన్) ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ న‌డుపుతుంటాడు. అత‌డి మేకప్ స్టైల్​కు మ‌హిళ‌లు ఫుల్ ఫ్యాన్స్ అయిపోతాయి. చిన్నప్పుడే చ‌నిపోయిన త‌న త‌ల్లి నేర్పించిన విద్యతో, ఆమె జ్ఞాప‌కంలా సోనూ పార్లర్‌ నిర్వహిస్తుంటాడు. ఎవ‌రికి క‌ష్టం వ‌చ్చినా ఆదుకుంటుంటాడు. ఉన్నట్టుండి సోనూకు స‌మ‌స్యలు వచ్చి పడతాయి. వాటి నుంచి గ‌ట్టెక్కాలంటే పారిపోవ‌డ‌మే బెటర్ అని లోనూ ఫ్రెండ్స్​ స‌ల‌హా ఇస్తారు. కానీ, సోనూ అలా చేయ‌కుండా లైలా అనే అమ్మాయిగా గెట‌ప్ మార్చేస్తాడు. అలా ఎంత‌కాలం త‌ప్పించుకు తిరిగాడు? లైలా అమ్మాయి కాద‌ని సోనూ అని తెలిశాక ఏం జరిగింది? అనేది బిగ్ స్క్రీన్​పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?
హీరోని లేడీ గెట‌ప్‌లో చూపిస్తేనో, విల‌న్ పాత్ర‌ల్ని కామెడీగా మార్చేస్తేనో ప్ర‌తి స‌న్నివేశానికీ ద్వంద్వార్థం ధ్వ‌నించేలా రెండు మూడు సంభాష‌ణ‌ల్ని వినిపించుకుంటూ పోతేనో హాస్యం పండ‌ద‌నే విష‌యాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు గుర్తించాలి. యువ‌త‌ర‌మే ల‌క్ష్యంగా తీసిన చిత్ర‌మిద‌ని సినీ వ‌ర్గాలు తెలిపాయి. ఏమాత్రం ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌, క‌థ‌నాలు చౌక‌బారుగా, ఇంకొన్నిసార్లు అతిగా సాగే స‌న్నివేశాల్ని తెర‌పై చూపించేస్తే యువ‌త‌రానికి న‌చ్చుతుందా?

పేల‌వ‌మైన క‌థ‌, పాత‌కాల‌పు మేకింగ్‌తో ఆరంభంలోనే ఈ సినిమా చ‌తికిల‌ప‌డిపోయింది. ఏమాత్రం నేచురాలిటీ లేని పాత్ర‌లు, స‌న్నివేశాలు ఏ ద‌శ‌లోనూ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించ‌వు. సోనూ మోడ‌ల్ పాత్ర కానీ, అత‌ని వ్య‌క్తిత్వాన్ని ప‌రిచ‌యం చేసిన విధానంలో కానీ మ‌చ్చుకైనా కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. హీరోని చుట్టుముట్టే క‌ష్టాలన్నీ కూడా అసంబ‌ద్ధంగానే ఉంటాయి. పెళ్లికూతురు మేక‌ప్‌తో మోసం చేసింద‌ని తెలిశాక‌, అలా మేక‌ప్ చేసిన‌వాళ్ల‌పైన క‌క్ష తీర్చుకోవ‌డం గురించి ఎప్పుడైనా విన్నామా? అల‌వాటైన బ్యూటీపార్ల‌ర్ మూసేశారంటే ఇంట్లో ఆడ‌వాళ్లు జ‌డ కూడా వేసుకోకుండా, చింపిరి జుట్టుతోనే తిరుగుతుంటారా? ఇలాంటి చిత్ర విచిత్ర‌మైన స‌న్నివేశాలు ఈ సినిమాలోనే ఉంటాయి.

సెకండ్ హాఫ్​లో లైలా గెట‌ప్‌లో విశ్వక్‌ చేసిన సంద‌డి కాస్త ఫర్వాలేద‌నిపిస్తుంది. అత‌ని హావ‌భావాలు బాగున్నాయి కానీ, ద్వితీయార్ధం దాదాపుగా లైలాగానే క‌నిపించినా, బ‌లంగా న‌వ్వించిన స‌న్నివేశం ఒక్క‌టీ లేదు. అత‌ను లైలాగా మారిపోవ‌డం వెన‌క కార‌ణం కూడా ఏమాత్రం సమంజసంగా లేదు. అన్నీ బ‌ల‌వంతపు స‌న్నివేశాలే. ప్రథ‌మార్ధంలో హీరోహీరోయిన్ల ప్రేమ‌క‌థ కంటే, ద్వితీయార్ధంలో లైలాకీ, విల‌న్ రుస్తుం (అభిమ‌న్యు సింగ్‌) మ‌ధ్య ప్రేమ‌క‌థే న‌యం అనిపిస్తుంది. క్లైమాక్స్​కు వ‌చ్చేస‌రికి అదే హీరోలా క‌నిపిస్తుంది త‌ప్ప‌, హీరో ఆడ‌వేషం వేసి సాధించిందంటూ ఏమీ ఉండ‌దు. లైలా అమ్మాయి కాదు, అబ్బాయే అని బ‌య‌ట ప‌డే స‌న్నివేశాలు కానీ, ఆ త‌ర్వాత క‌థ‌లో చోటు చేసుకునే ప‌రిణామాలు కానీ ఏమాత్రం ఉత్కంఠ రేకెత్తించ‌వు.

ఎవ‌రెలా చేశారంటే?
విశ్వక్‌సేన్‌ లైలా పాత్ర‌లో ఒదిగిపోయారు. అమ్మాయిగా అత‌ని గెట‌ప్‌, హావ‌భావాలు ఆక‌ట్టుకుంటాయి. కానీ ర‌చ‌న‌లోనే బ‌లం లేక‌పోవ‌డంతో ఆయ‌న ప్ర‌య‌త్నం వృథా అయ్యింది. సోనూ మోడ‌ల్ పాత్ర విశ్వక్‌కు అల‌వాటైందే. క‌థానాయిక పాత్ర‌లో బ‌లం లేదు. గ్లామ‌ర్ కోస‌మే అన్న‌ట్టుగా ఆమె తెర‌పై క‌నిపించింది. అభిమ‌న్యుసింగ్ పాత్ర ఇందులో కీల‌కం. కామెడీ విల‌న్‌గా ఆయ‌న సినిమా అంతా క‌నిపిస్తారు. గొర్రెల మ‌ధ్య క‌నిపించే థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీరాజ్ పాత్ర‌లో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు. కామాక్షి భాస్క‌ర్ల త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఫర్వాలేద‌నిపిస్తుంది. లియోన్ జేమ్స్ స్వ‌ర‌ప‌రిచిన రెండు పాట‌లు, వాటి చిత్రీక‌ర‌ణ బాగుంది. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం విభాగాలు తేలిపోయాయి. క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు, దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన విధానం కూడా అంతే ముత‌క‌గా ఉంది. నిర్మాణం ప‌రంగా లోటేమీ క‌నిపించ‌దు.

బ‌లాలు

  • లైలా గెట‌ప్‌లో విశ్వక్‌సేన్‌

బ‌లహీన‌త‌లు

  • ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌, క‌థ‌నాలు
  • అస‌భ్యక‌ర‌మైన సంభాష‌ణ‌లు
  • కొర‌వ‌డిన హాస్యం, భావోద్వేగాలు

చివ‌రిగా : 'లైలా' గెట‌ప్ వేస్తే చాలా?

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details