Village Mystery Movies in Telugu : ఇటీవల కాలంలో టాలీవుడ్లో గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతంలో వచ్చిన సాయిధరమ్ తేజ్ 'విరూపాక్ష' నుంచి కిరణ్ అబ్బవరం రీసెంట్ హిట్ 'క' వరకూ ఈ జానర్లో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించినవే. ఈ క్రమంలో ఇప్పటి వరకూ విలేజ్ బ్యాక్ డ్రాప్ థ్రిల్లర్‌గా తెరకెక్కి హిట్ కొట్టిన సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం పదండి.
ఒక చిన్న పల్లెటూరు. అందులో దాగున్న రహస్యం. అనుకోకుండా హీరో ఆ ఊరికి రావడం. తన చుట్టూ జరుగుతన్న అనూహ్య ఘటనల వెనక కారణం తెలుసుకునేందుకు రంగంలోకి దిగడం. ఊహించని ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేసి షాకింగ్ క్లైమాక్స్ తో మూవీ శుభం కార్డు పడటం. గత కొన్నాళ్లుగా ఈ జానర్లో ఎన్నో చిత్రాలు వెండితెరపై సందడి చేశాయి. ఇదే ఫార్ములాను ఉపయోగించి పలువురు డైరెక్టర్లు కూడా సూపర్ హిట్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు కూడా.
విరూపాక్ష
సుకుమార్ శిష్యుడైన కార్తిక్ దండు డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన మూవీ 'విరూపాక్ష'. ఈ సినిమా మొత్తం అడవి, ఓ మారుమూల గ్రామం చుట్టే తిరుగుతుంది. అలాగే రాత్రి వేళలోనే ఎక్కువ భాగం మూవీ ఉంటుంది. చీకటి వాతావరణంలో ఈ థ్రిల్లర్‌ను డైరెక్టర్ ఆద్యంతం ఉత్కంఠగా తెరకెక్కించారు. దీంతో ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, మంచి కలెక్షన్లు సాధించింది.
మా ఊరి పొలిమేర-2
కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యం రాజేశ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'పొలిమేర 1' ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 'మా ఊరి పొలిమేర 2' వచ్చింది. ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్ థ్రిల్లర్‌గా వచ్చి అదరగొట్టింది. పెద్దపెద్ద నటులు లేకపోయినప్పటికీ థియేటర్లలో సత్తాచాటి మంచి వసూళ్లతో ట్రెండ్ అయ్యింది.