Vikrant Massey Justice Hema Committee Report :12th ఫెయిల్ ఫేమ్ నటుడు విక్రాంత్ మస్సే తాజాగా జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మహిళలపై ఆ రకంగా దాడులకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు పడాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని ఉద్దేశించి కూడా విక్రాంత్ ఈ సందర్భంగా మాట్లాడారు. అటువంటి వారిని అస్సలు వదిలిపెట్టకూడదని అన్నారు. వారికి మరణ శిక్ష విధించాలని అన్నారు.
"హేమ కమిటీ రిపోర్ట్, మలయాళ సినీ ఇండస్ట్రీ అనే విషయాలను పక్కన పెడితే ఇటువంటి పరిస్థితులు అన్ని చోట్లా ఉన్నాయి. వర్కింగ్ ప్లేస్‌ల్లోనూ మహిళలు ఏదో ఒక రకంగా వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రస్తుత సమాజంలో మాకు ఉన్నంత రక్షణ మహిళలకు లేకపోవడం నిజంగా దురదృష్టకరమని భావిస్తున్నాను. మహిళల సంరక్షణ విషయంలో మనమందరం ఏకతాటి మీదకు రావాలి. వారి రక్షణ కోసం మనవంతుగా పాటుపడాలి. మార్పు మొదలు కావాలి. ఓ వ్యక్తి నుంచి ఈ మార్పు మొదలైతే, సమాజం కూడా మారుతుందని నేను నమ్ముతాను" అని విక్రాంత్ తెలిపారు.
'హసీన్ దిల్‌రుబా', '12th ఫెయిల్' లాంటి సినిమాల్లో తన నటనకుగానూ విక్రాంత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా '12th ఫెయిల్'లో ఓ ఇన్స్పిరేషనల్ క్యారెక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాకు గానూ ఆయనకు పలు అవార్డులతో పాటు ప్రశంసలు వచ్చాయి. పాన్ ఇండియా లెవెల్లోనూ గుర్తింపు పొందారు. ఆ తర్వాత విక్రాంత్ 'ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇందులోనూ తన యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి.