Love Guru Movie review :
చిత్రం : లవ్‌గురు;
నటీనటులు : విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, యోగిబాబు, వీటీవీ గణేష్, ఇలవరుసు, శ్రీజ రవి, తలైవసల్ విజయ్ తదితరులు;
సంగీతం : భరత్ ధన శేఖర్;
సినిమాటోగ్రఫీ : ఫారూక్ బాష;
ఎడిటింగ్ : విజయ్ ఆంటోనీ;
నిర్మాత : మీరా విజయ్ ఆంటోనీ, విజయ ఆంటోనీ, సంద్రా జాన్సన్, నవీన్‌కుమార్;
రచన, దర్శకత్వం : వినాయక్ వైద్యనాథన్
ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ జానర్‌లో నటించిన చిత్రమే లవ్ గురు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో విడుదల చేసింది. ఇంతకీ ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే ? మలేషియాలో కేఫ్ నడిపే అరవింద్‌ను (విజయ్ ఆంటోని) తన చెల్లి తాలూకూ ఓ చేదు గతం వెంటాడుతూ ఉంటోంది. మరోవైపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల పనిలో పడి తన వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోడు. అలా 35ఏళ్లు వచ్చేస్తాయి. ఫైనల్‌గా బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పాలని ఇండియాకు తిరిగొచ్చి అతడు అనుకోకుండా ఓ చావు ఇంట్లో తన చుట్టాల అమ్మాయి లీల (మృణాళిని రవి)ను చూసి ప్రేమలో పడతాడు. ఇది తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు ఆ అమ్మాయి వాళ్ల అమ్మనాన్నతో మాట్లాడి పెళ్లి చేస్తారు. కానీ, నటి కావాలనుకున్న లీలాకు ఆ పెళ్లి అసలు ఇష్టముండదు. ఈ విషయం అరవింద్‌కు అర్థమయిపోతుంది. మరి ఆ తర్వాత తర్వాత ఏమైంది? అరవింద్ తన భార్య మనసు గెలుచుకున్నాడా? అందుకోసం ఏం చేశాడు? అసలు అతడిని వెంటాడే చెల్లి గతం ఏంటి? హీరోయిన్ అవ్వాలనుకున్న లీలా నటిగా మారిందా? చివరకు అరవింద్‌ను భర్తగా ఓప్పుకుందా? అనేదే కథ.
ఎలా సాగిందంటే : ఒక భర్త తన భార్య మనసు గెలవడానికి ప్రయత్నించే కథ ఇది. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు చాలానే వచ్చాయి. అయితే దర్శకుడు దీన్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దిన తీరు బాగుంది. ఈ కథకు చెల్లి సెంటిమెంట్‌ను జోడించి ఎమోషనల్‌గా చూపించాడు. రొటీన్ డ్రామాతో సినిమా మొదలై తర్వాత కథలో వినోదం మొదలవుతుంది. ట్రెడిషనల్‌గా కనిపించిన లీలా ఒక్కసారిగా మోడ్రన్ గర్ల్‌గా మారడం, ఇంట్లోనే ఫ్రెండ్స్‌తో కలిసి హంగామా చేయడం, అరవింద్‌ను దూరం పెట్టేందుకు చేసే ప్రయత్నాలు, వాటిని అతడు తన ప్రేమతో తిప్పికొట్టే సీన్స్ అన్నీ ఫన్నీ ఫన్నీగా సాగుతాయి. మధ్యలో షారుక్ ఖాన్ రబ్ నే బనా ది జోడీ చిత్రాన్ని కూడా గుర్తు చేస్తుంది. క్లైమాక్స్‌లో లీలాను హీరోయిన్ చేసేందుకు అరవింద్ నిర్మాతగా మారడం కూడా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. అలా ఫస్ట్ హాప్ ఫన్నీగా సాగిన కథనం సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా మారిపోతుంది. హీరో చెల్లికి దూరమైన ఎపిసోడ్ కథను కాస్త సీరియస్‌గా తీసుకెళ్తుంది. క్లైమాక్స్‌లో అరవింద్, లీలాకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే ? కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో విజయ్ ఆంటోనీ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తనకు మృణాళినికి మధ్య వచ్చే సీన్స్‌లో విజయ్ నటన భావోద్వేగభరితంగా ఉంటుంది. లీలాగా మృణాళిని అందంగా కనిపించింది. విజయ్ మామయ్యగా వీటీవీ గణేష్ నవ్వులు పూయించారు. ప్రేమ సలహాలు ఇచ్చే పాత్రలో యోగిబాబు కూడా నవ్వించారు. ఇళవరసు, సుధ, తలైవాసల్ విజయ్ తదితరుల పాత్రలు కూడా బాగానే ఉన్నాయి. ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు సినిమాను ఎక్కడా బోర్ కొట్టించనీయకుండా తీర్చిదిద్దాడు. ఫైనల్‌గా ఈ చిత్రం ద్వారా పెళ్లి అనేది స్త్రీ కలలకు అడ్డంకి కాదు అనే ఓ సందేశాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు.
అంజలి 50వ సినిమా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ఎలా ఉందంటే? - Geethanjali Malli Vachindi Review
'నేనుంటే టాలీవుడ్ స్టార్ హీరోస్‌ను ఎవ్వరూ పట్టించుకోరు' - Priyamani on Star Heroes