ARM Movie Review In Telugu : మిన్నల్ మురళి, 2018 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో టొవినో థామస్ నటించిన 50వ చిత్రం ఎ.ఆర్.ఎమ్.(అజయంతే రండమ్ మోషనమ్). తెలుగులో అజయన్ చేసిన రెండో దొంగతనం అని అర్థం. ఇందులో టొవినో ట్రిపుల్ రోల్ చేశారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. మలయాళంలో ఇదే ఆమెకు తొలి సినిమా. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే?
కథేంటంటే(ARM Movie Story) : ఊళ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లి (రోహిణి)తో కలిసి ఉంటాడు అజయ్(టొవినో థామస్). అతడి తాత మణియన్ (టొవినో థామస్) ఒకప్పుడు పెద్ద దొంగ. దీంతో ఊరిలో ఎక్కడ ఏ దొంగతనం జరిగినా అందరూ అజయ్‌పైనే అనుమానపడుతుంటారు.
అయితే ఆ ఊరిలో ఓ గుడి ఉంటుంది. అందులో కొలువైన శ్రీభూతి దీపానికి పెద్ద చరిత్రే ఉంటుంది. బంగారం కన్నా దానిని విలువైనదిగా చూస్తుంటారు. అయితే దాన్ని దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఊరిలోకి అడుగు పెడతాడు సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్). కానీ ఆ నేరాన్ని అజయ్‌పై నెట్టేలా ప్లాన్ చేస్తాడు. అయితే ఎన్నో తరాలుగా ఆ దీపాన్ని కాపాడుతూ వస్తుంది అజయ్ కుటుంబం. మరోవైపు అజయ్ పెద్దింటి అమ్మాయి లక్ష్మి (కృతిశెట్టి)తో ప్రేమలో పడతాడు. మరి అజయ్ ఆ దీపాన్ని ఎలా కాపాడాడు? ఇంతకీ ఆ దీపం, విగ్రహం వెనక ఉన్న చరిత్ర ఏంటి? ఆ చరిత్రలో మహావీరుడు కుంజికేలు (టొవినో థామస్) పాత్ర ఏంటి? కృతి శెట్టితో ప్రేమాయణం సక్సెస్ అవుతుందా? అనేదే పూర్తి కథ.
ఎలా ఉందంటే : వేర్వేరు కాలాల్లో సాగే మూడు తరాల కథ ఇది. నిధి అన్వేషణతో ఈ కథ సాగుతుంది. కథే ఈ చిత్రానికి పెద్ద బలం. టెక్నికల్ వ్యాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. హీరోగా టొవినో పోషించిన మూడు పాత్రలు బాగున్నాయి. ఇతర పాత్రలు అంతగా ప్రభావం చూపలేదు. కథనం పరంగా మెరుపులు లేకపోయినా కథ బానే సాగింది. సినిమాకు మణియన్ పాత్రే హైలైట్. ద్వితీయార్ధంలో కాస్త నిడివి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో బలం కాస్త తగ్గింది. కృతి శెట్టితో సాగే లవ్‌స్టోరీలో సంఘర్షణ కొరవడింది. మొత్తంగా ఇదో కొత్త రకమైన కథ అని చెప్పొచ్చు.