Tollywood Upcoming Movies :సక్సెస్ఫుల్ కాంబోలకు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్‌పై ముస్తాబవుతున్న పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో ఇలాంటి కాంబోలే. అయితే వీటికి పోటీగా అదే స్థాయిలో అంచనాలు పెంచుతున్న తొలి కలయికలూ ఇప్పుడు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని సెట్స్‌పైకి వెళ్లగా మరికొన్ని సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ తొలిసారి జట్టు కట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఆ కాంబోలు ఏంటో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీలో ఎక్కువగా యువ దర్శకులతోనే పని చేస్తున్నారు. సైరా నరసింహరెడ్డి, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య ఈ కోవకే చెందినవి. ఇప్పుడు వశిష్ఠతో విశ్వంభర చేస్తున్నారు. బింబిసార విజయం తర్వాత వశిష్ఠ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇది. అంజి తర్వాత ఇన్నేళ్లకు చిరు మళ్లీ ఈ తరహా కథలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ తర్వాత దాదాపు అరడజను మందికి పైగా దర్శకులు చిరు కోసం కథలతో రెడీగా ఉన్నారట. వారిలో మారుతి, హరీశ్ శంకర్, అనుదీప్, కల్యాణ్ కృష్ణ, త్రినాథరావు నక్కిన తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడూ ముందే ఉంటారు నాగార్జున. ఇప్పుడాయన శేఖర్ కమ్ములతో కుబేర చేస్తున్నారు. దీని తర్వాత ఆయన తమిళ యువ దర్శకుడు నవీన్‌తో చేయనున్నారట. అలానే సుబ్బు అనే మరో కొత్త దర్శకుడితోనూ చేయనున్నారని తెలుస్తోంది.
ప్రభాస్ నాగ్అశ్విన్తో కల్కి 2898ఎ.డి, మారుతితో రాజాసాబ్, సందీప్‌రెడ్డి వంగాతో స్పిరిట్ ఇలా తెరకెక్కుతున్న సినిమాలన్నీ తొలి కలయికే. నెక్స్ట్ హను రాఘవపూడితో చేయనున్నారట. ఓ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఇది రూపొందనుందట.
ప్రస్తుతం వరుసగా కొత్త కలయికల్ని ఖరారు చేస్తూ దూసుకెళ్తున్నారు రవితేజ, నాని. ప్రస్తుతం రవితేజ చేస్తున్న మిస్టర్ బచ్చన్, ఆ మధ్య చేసిన వాల్తేరు వీరయ్య తప్పా ఈ మధ్యలో వచ్చినవన్నీ తొలి కలయికల్లో రూపొందినవే. త్వరలోనే భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితోనూ చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని సమాచారం.