GST Council Meeting Updates : జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ తొలగింపు సహా పలు అంశాలే ఎజెండాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 55వ కౌన్సిల్ సమావేశానికి రాజస్థాన్‌లోని జైసల్మేర్ వేదికైంది. పలు వస్తువులపై రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల మార్పు వంటి అంశాలు ఇందులో చర్చించనున్నారు. అయితే, జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తొలగింపు అంశాన్ని జీఎస్టీ మండలి మరోసారి వాయిదా వేసింది. ఈ అంశంపై మరింత పరిశీలన అవసరం అని కౌన్సిల్ అభిప్రాయపడినట్లు తెలిస్తోంది.
ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలని పాలసీదారులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్‌లో సమావేశమై జీఎస్టీ తొలగించేందుకు నిర్ణయించింది. టర్మ్ పాలసీలు సహా పెద్దలు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు చేసేందుకు మంత్రుల బృందం సుముఖత వ్యక్తం చేసింది. సాధారణ వ్యక్తులు తీసుకునే రూ.5 లక్షలలోపు ఆరోగ్య బీమా పాలసీలపై కూడా జీఎస్టీ మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించింది. అయితే రూ.5 లక్షలు దాటిన ఆరోగ్య బీమా పాలసీలకు ప్రస్తుత 18 శాతం జీఎస్టీని కొనసాగించాలని నిర్ణయించింది. దీనిపై ఆరంభంలోనే చర్చించిన కౌన్సిల్ - ఈ అంశాన్ని వాయిదా వేసింది. దీంతో సామాన్యులకు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఇతర అంశాలపై మండలిలో చర్చ జరుగుతోంది.
కీలక అంశాలు
- స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై విధిస్తున్న 18% జీఎస్టీ (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో కూడిన)ని 5 శాతానికి (ఐటీసీ లేకుండా) తగ్గించేందుకు ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం సమావేశంలో ఈ అంశం చర్చకు రానుంది.
- పాత విద్యుత్ వాహనాలతో పాటు చిన్న పెట్రోల్/డీజిల్ కార్లపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 18 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపైనా ఈ భేటీలో చర్చ జరగనుంది. ప్రస్తుతం పెద్ద కార్లకు 18% జీఎస్టీ వర్తిస్తోంది.
- ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
- జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం 148 వస్తువుల రేట్లను హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించింది. అందులో సిగరెట్లు, శీతలపానీయాలు, పొగాకు ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై ఉన్న 28% జీఎస్టీని 35 శాతానికి పెంచాలన్న కీలక ప్రతిపాదనపై కూడా కౌన్సిల్‌లో చర్చించనున్నారు.
- ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 పన్ను శ్లాబులు ఉన్నాయి. కొత్తగా 35% శ్లాబ్‌ను తీసుకురావాలని మంత్రల బృందం ప్రతిపాదించింది. ప్రధానంగా హానికర ఉత్పత్తులపై ఈ శ్లాబు రేటును వర్తింపజేయాలని పేర్కొంది.
- శీతల పానీయాలతో పాటు దుస్తులపైనా పన్ను రేట్లలో మార్పులు చేయాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. రూ.1500 వరకు ఉండే రెడీమేడ్ దుస్తులపై 5%, రూ.1500- 10,000 మధ్య 18%, రూ.10,000 పైబడిన దుస్తులపై 28% జీఎస్‌టీ విధించాలని నిర్ణయించారు. ఈ అంశంపైనా కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రానికి కౌన్సిల్ నిర్ణయాలు వెలువడనున్నాయి.