SWAG Movie Review :
చిత్రం : శ్వాగ్;
నటీనటులు : శ్రీవిష్ణు, రీతు వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను తదితరులు;
సంగీతం :వివేక్ సాగర్;
సినిమాటోగ్రఫీ : వేదరామన్ శంకరన్;
ఎడిటింగ్ : విప్లవ్ నైషధ్;
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల;
రచన, దర్శకత్వం :హసిత్ గోలి;
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు వైవిధ్య కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. చివరిగా సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాలతో హిట్ అందుకున్న ఆయన తాజాగా ఇప్పుడు 'శ్వాగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజ రాజ చోర వంటి హిట్ తర్వాత హసిత్ గోలి - శ్రీ విష్ణు కాంబోలో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో శ్రీవిష్ణు నాలుగు పాత్రల్లో పోషించారు. మరి ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? తెలుసుకుందాం.
SWAG Movie Story(కథేంటంటే) :1551లో శ్వాగణిక వంశానికి చెందిన రాజు(శ్రీ విష్ణు) మాతృస్వామ్య కుటుంబంలో అణిగిమణిగి ఉంటాడు. అతడు పురుషుడి ఆధిపత్యం కోసం ఆరాట పడుతుంటాడు. తన వారసత్వం కొనసాగాలని భావిస్తాడు. అనుకున్నట్టే వారసుడు పుట్టడంతో తన హయాం నుంచి పితృస్వామ్యం పరంపరను కొనసాగిస్తాడు. అయితే యయాతి, భవభూతి, సింగరేణి అలియాస్ సింగ (శ్రీవిష్ణు) - వీరంతా ఆ కుటుంబానికి చెందిన భిన్న తరాల వ్యక్తులే. యయాతి, భవభూతి పురుషాధిక్యం కోసం చేసిన ప్రయత్నాలతో ఆ కుటుంబంతో ఒకరితో మరొకరికి సంబంధాలు తెగిపోతాయి. అయితే ఈ వంశానికి చెందిన ఖజానా దక్కాలంటే నేటి తరానికి చెందిన వారసుడు ఎక్కడున్నాడో కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం ఎస్.ఐ.భవభూతి చేసిన ప్రయత్నం ఫలించిందా? ఖజానా ఎవరికి దక్కింది. ?ఈ కథలో విభూతి ఎవరు? నిజమైన వారసత్వం అంటే ఏమిటి? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే? : ఈ కథలో బలమైన సందేశం, మనసుల్ని హత్తుకునే భావోద్వేగం ఉన్నప్పటికీ కథను సరిగ్గా చెప్పలేకపోయారు. ఏ పాత్ర ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, అసలు వాటి లక్ష్యమేమిటి అనేది క్లారిటీ అవ్వలేదు. అంతా గజిబిజిగా ఉంది. శ్రీవిష్ణు బోలెడన్ని గెటప్పులు, విచిత్రమైన హావభావాలు, డైలాగ్‌లు చెప్పినప్పటికీ ఎక్కడా పండలేదు. కథ సాగదీతగా అనిపించింది.
ఫస్ట్ హాఫ్ మొత్తం వంశాలు, వారసత్వాలు, మాతృస్వామ్యం, పితృస్వామ్యం వంటి చూపించారు. అయితే అంతా గందరగోళంగా చూపించారు. సెకండాఫ్‌లో కాస్త కథ కుదుట పడినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మూడో లింగం చుట్టూ అల్లిన సన్నివేశాలు, వాటితో పండిన భావోద్వేగాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. లింగ సమానత్వం గురించి దర్శకుడు ఇందులో బలంగా చెప్పారు. ఫైనల్‌గా కథనంలో లోపం ఉండటం వల్ల ఓ మంచి ఆలోచన వృథా అయిపోయినట్టు అనిపించింది.
శ్రీవిష్ణు నాలుగు పాత్రలు పోషించగా, అందులో చూపించిన వైవిధ్యం బానే ఉంది. కానీ నవ్వు రాలేదు. రీతూవర్మ కూడా భిన్న కోణాల్లో కనిపించింది. కానీ ఆ పాత్రలో పెద్దగా బలం లేదు. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై కనిపించిన మీరాజాస్మిన్ పాత్ర, ఆమె నటన ఆకట్టుకుంటుంది. సునీల్, రవిబాబు, దక్ష నగర్కర్, గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా పనితనం బాగుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
చివరిగా: శ్వాగ్ ఓ సాగదీత
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: విష్ణు ఖాతాలో మరో హిట్? - Swag Movie Review
బన్నీ, ప్రభాస్, పవన్ కల్యాణ్‌లో ఎవరు పెద్ద స్టార్? ప్రొడ్యూసర్ ఆన్సర్ ఇదే! - Tollywood Star Heros