Tollywood Dancer Heroines : అందం, నటన - చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా రాణించడానికి ఈ రెండూ ఉంటే చాలు అనే రోజులు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడాలన్నా, కమర్షియల్ హీరోయిన్గా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్నా తమలోని అదనపు ప్రతిభను ప్రదర్శించాల్సిందే. అందుకే నవతరం భామలు తమలోని టాలెంట్‌ను ప్రదర్శించడంలో పరిమితం కావడం లేదు.
అయితే హీరోయిన్గా రాణించాలంటే అదనపు ప్రతిభల్లో డ్యాన్స్ కూడా ఒకటి. అందుకే ప్రస్తుత తరం నాయికలు అవకాశం వస్తే చాలు డ్యాన్స్‌తో అదరగొట్టే ప్రయత్నం చేస్తూ కుర్రాళ్లను, సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.
అంతకుముందు సీనియర్లు హీరోయిన్లు అనుష్క, తమన్నా, కాజల్ అగర్వాల్, సమంత, శ్రుతిహాసన్, పూజాహెగ్డే ఇలా చాలామంది తమ డ్యాన్సులతో అదరగొట్టినవారే. తద్వారా కమర్షియల్ కథానాయికలుగా ఓ వెలుగు వెలిగారు. అందుకే ఇప్పుడు నవతరం భామలు కూడా వీళ్ల బాటలోనే ప్రయాణం చేస్తూ అదిరిపోయే డ్యాన్స్‌లతో ఆకట్టుకుంటున్నారు.
- ఆ మధ్య గుంటూరు కారంలో 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి శ్రీలీల చేసిన డ్యాన్స్ హంగామా నషాళానికి తాకింది. భాషతో సంబంధం లేకుండా అందరినీ ఊపేసింది.
- రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే పాటల కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ కూడా కుర్రాళ్లను ఫిదా చేసేసింది. థియేటర్లలో ఈ పాట వచ్చినప్పుడు యూత్ అంతా ఊగిపోయారు.
- ఇక దేవర దావూదీ సాంగ్‌లో జాన్వీ కపూర్ కూడా అదరగొట్టింది. తారక్‌తో కలిసి ఓ వైపు అందాన్ని చూపిస్తూనే మరోవైవు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంది.