Tiger Jackie Shroff:వైవిధ్యభరితమైన యాక్షన్ స్టోరీలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. తనదైన నటన, మంచి బాడీని మెయింటెన్ చేస్తూ కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో కలిసి 'బడే మియా ఛోటే మియా ' సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న గ్రాండ్గా విడుదలైందీ సినిమా. దీంతో హీరోలు టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్లలో టైగర్ ష్రాఫ్ తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అసలు తన పేరులో 'టైగర్' పదం ఎలా వచ్చిందో చెప్పారు.
తన అసలు పేరు జై హేమంత్ ష్రాఫ్ అని బయటపెట్టారు టైగర్ ష్రాఫ్. ఆ పేరునే తన తల్లిదండ్రులు జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ పెట్టారని చెప్పుకొచ్చారు. మరి టైగర్ అని పేరు ఎలా వచ్చిందని ఇంటర్వ్యూలో అడగ్గా అప్పుడు తన పేరు వెనక ఉన్న అసలు సంగతి వెల్లడించారు. తన చిన్నతనంలో మనుషులను కొరకడం(కరవడం) వల్లే తనకు టైగర్ అనే పేరు వచ్చిందని వివరించారు. ' నా బాల్యంలో చాలా మందిని కొరికేవాడిని. అందుకే నాకు టైగర్ అనే పేరు వచ్చింది. నా తండ్రి జాకీ ష్రాఫ్ అసలు పేరు జై కిషన్. మా మాయయ్య పేరు హేమంత్. అందుకే నాకు మా తల్లిదండ్రులు జై హేమంత్ ష్రాఫ్ అని పేరు పెట్టారు. నన్ను చిన్నప్పటి నుంచి అందరూ టైగర్ అని పిలిచేవారు. అందుకే సినిమాల్లోకి వచ్చాక కూడా నా పేరు ముందు టైగర్ అనే పెట్టుకున్నాను.' అని టైగర్ ష్రాఫ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.