Shahrukh Khan Disaster Film : సినిమాలో ఎంతపెద్ద స్టార్లు ఉన్నా ఒక్కొసారి అది విజయం సాధించకపోవచ్చు. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించలేకపోవచ్చు. కథ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. అలాగే భారీగా కలెక్షన్లు వస్తాయి. ఇందుకు ఏ సినీ ఇండస్ట్రీ మినహాయింపు కాదని ఎన్నో సార్లు నిరూపితమైంది. అయితే బాలీవుడ్లో 6 ఏళ్ల క్రితం విడుదలైన ఓ చిత్రంలో అగ్రనటుడు, మరో ఇద్దరు స్టార్ కథానాయికలు ఉన్నా సినిమాను అపజయం నుంచి గట్టెక్కించలేకపోయారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ను కూడా తిరిగి సాధించలేకపోయారు. ఇంతకీ ఆ సినిమా ఏది? బాక్సాఫీసు వద్ద ఎంతమేర కలెక్షన్లు సాధించింది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'జీరో'. ఇందులో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. అభయ్ దేఓల్, మాధవన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు సల్మాన్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ, కరిష్మా కపూర్, జుహీ చావ్లా, అలియా భట్, దీపికా పదుకొనే, జయా బచ్చన్ వంటి నటులు అతిథి పాత్రల్లో మెరిశారు. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 2018 డిసెంబరులో థియేటర్లలో విడుదలైంది.
బడ్జెట్ను వసూలు చేయలేక విలవిల!
భారీ అంచనాల మధ్య రిలీజైన 'జీరో' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో ఉన్న భారీ తారాగణం కూడా మూవీని గట్టెక్కించలేకపోయారు. దీంతో రూ.200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'జీరో' మూవీ కేవలం రూ.191కోట్లు వసూళ్లను మాత్రమే సాధించి నిరాశపర్చింది.