The Roshans Documentary OTT :The Roshans Documentary OTT : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యామిలీపై ప్రముఖ ఓటీటీ సంస్థ తెరకెక్కించిన స్పెషల్ డాక్యుమెంటరీనే 'ది రోషన్స్'. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రోషన్ కుటుంబం అందిస్తున్న విశిష్ట సేవలను, అలాగే ఆ కుటుంబంలోని మూడుతరాల వారి గురించి డీప్‌గా ఈ డాక్యుమెంటరీలో చూపనున్నారని తెలుస్తోంది. వీటితో పాటు హృతిక్ రోషన్ ఆయన తండ్రి రాకేశ్ రోషన్, తాతయ్య రోషన్ కెరీర్, అలాగే పర్సనల్ లైఫ్ గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.
తాజాగా ఫైనల్ ఎడిట్ పూర్తి చేసుకున్న ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్కు రానుంది. జనవరి 17 నుంచి ఆడియెన్స్‌కు అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించింది. అందులో హృతిక్‌తో పాటు తన తండ్రి, తాతయ్య ఉన్నారు.
ఇక హృతిక్ సినీ కెరీర్ విషయానికి వస్తే, 2000వ ఏడాది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన తండ్రి రాకేశ్ రోషన్ డైరెక్షన్లో 'కహో నా ప్యార్ హై' సినిమాతోనే ఆయన తెరంగేట్రం చేశారు. అయితే తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు హృతిక్. అంతేకాకుండా ఆ ఏడాది అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగానూ 'కహో నా ప్యార్హై' రికార్డుకెక్కింది. ఇక హృతిక్ ఉత్తమ నటుడిగానూ పలు పురస్కారాలను అందుకున్నారు. అప్పటి నుంచి తన సినీ జర్నీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.